ఆదిత్య ఓం.. గురించి టాలీవుడ్లో పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. ఆదిత్య ఖాతాలో అడపాదడపా హిట్స్ ఉన్నప్పటికీ అవేవీ అతని కెరీర్‌కు ప్లస్ అవ్వలేదు. దీంతో చాలా రోజులు గ్యాప్ తీసుకున్న ఆదిత్య ఓం.. బిగ్‌బాస్ సీజన్ 8తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తాజాగా ‘బందీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రఘు తిరుమల దర్శకత్వంలో గల్లీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 28న) విడుదలైంది.
కథ
ఆదిత్య వర్మ (ఆదిత్య ఓం ) ఓ కార్పొరేట్ లాయర్. అతనికి డబ్బు మీద పిచ్చి తప్ప ప్రేమ, బంధాలు అనుబంధాలపై విలువ లేదు. అందుకే పెళ్లయిన సరే.. వేరే అమ్మాయితో ఎఫైర్ నడిపిస్తూ ఉంటాడు. మరోవైపు ఓ కార్పొరేట్ కంపెనీ ఒక అడవిని నాశనం చేసి అక్కడ పెద్ద ఫ్యాక్టరీ నిర్మించాలని అనుకుంటుంది. కానీ దానికి లీగల్ సమస్యలు రావడంతో.. కంపెనీ తరఫున వాదించే కేసు ఆదిత్య వర్మకు వస్తుంది. ఆ కేసు ఒప్పుకున్న కొద్దిరోజులకే ఆదిత్య వర్మ కిడ్నాప్‌నకు గురవుతాడు. తాను ఏ అడవికి వ్యతిరేకంగా అయితే కేసు వాదిస్తున్నాడో.. అదే అడవిలో ఆదిత్య వర్మ ప్రత్యక్షమవుతాడు. అక్కడ అతనితో మాట్లాడటానికి ఎవరూ ఉండరు. ఇంతకీ ఆదిత్య వర్మను కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ అడవి నుంచి అతను బయటపడ్డాడా? లేదా? అసలు ఆదిత్య వర్మ కిడ్నాప్‌నకు అతని ప్రియురాలికి ఉన్న సంబంధమేంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇలాంటి థ్రిల్లర్ జోన్ మూవీస్ హాలీవుడ్లో చాలానే వచ్చాయి. కానీ తెలుగులో ఇదే మొదటిది అని చెప్పొచ్చు. వాతావరణం, అడవుల పరిరక్షణపై సామాజిక సందేశంతో థ్రిల్లర్ జోనర్‌ను జోడించి ఈ సినిమా కథను రాసుకున్నారు. ఈ కథ మొత్తం ఒకే ఒక్క క్యారెక్టర్‌పై మాత్రమే ఉంటుంది. మిగతా క్యారెక్టర్ల వాయిస్‌లు వినిపిస్తాయి.. తప్ప స్క్రీన్‌పై ఎవరూ కనిపించరు. సింగిల్ క్యారెక్టర్‌పైనే సినిమా నడుస్తుంది. సోలో క్యారెక్టర్ కావడంతో స్క్రీన్‌పై ఆదిత్య ఓం మాత్రమే కనిపిస్తాడు. కాబట్టి ఎక్కడా బోర్ కొట్టించకుండా తన నటనతో మెప్పించాడు. టెక్నికల్‌గా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. మధుసూదన్ సినిమాటోగ్రఫీ బాగుంది. వీరల్ – లవన్, సుదేశ్ సావంత్ ఇచ్చి మ్యూజిక్ ఆకట్టుకుంది. ప్రకాశ్ ఝా ఎడిటింగ్ కూడా సినిమాకు ప్రధాన బలమని చెప్పొచ్చు.
సినిమా మొదట్లో వచ్చే వాయిస్ ఓవర్ అంతగా బాగోలేదు. చిన్న పిల్లలకు చెప్పినట్టుగా ఉండటంతో బోర్ తెప్పిస్తుంది. సింగిల్ క్యారెక్టర్‌పై మూవీ కాబట్టి స్క్రీన్‌ప్లేను మరింత పటిష్టంగా రాసుకోవాల్సింది.
బలాలు
+ సినిమాటోగ్రఫీ
+ ఆదిత్య ఓం
బలహీనతలు
– స్క్రీన్‌ప్లే