గురువారం 22 అక్టోబర్ 2020
Realestate - Oct 17, 2020 , 00:29:32

ఔటర్‌లో అభివృద్ధి

ఔటర్‌లో అభివృద్ధి

కార్యరూపంలోకి ‘ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ-2020’ భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, నగర విస్తరణ కోసం ‘ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ-2020’కు రూపకల్పన చేసింది. ఇక ఔటర్‌ రింగు రోడ్డు పరిసరాలతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు వీలు కలుగనున్నది. 

రాజధాని ప్రతిష్ఠను ప్రపంచస్థాయిలో నిలుపాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర సర్కారు ముందుకు సాగుతున్నది. హైదరాబాద్‌ జనాభా ఇప్పటికే కోటి దాటగా, ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దానికి తగ్గట్లే శివారుల్లోనూ అభివృద్ధి శరవేగంగా సాగుతున్నది. అయితే, ఆయా ప్రాంతాల నుంచి విధుల కోసం కోర్‌ సిటీలోకి వచ్చేవారికి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. రోజులో మూడునాలుగు గంటలు ప్రయాణాలకే కేటాయించాల్సి వస్తున్నది. ఈ క్రమంలో తాము నివసించే ప్రాంతానికి దగ్గరలోనే పని స్థలాలు ఉండాలని వారు ఆశిస్తుండటంతో ‘వాక్‌-టూ-వర్క్‌' కాన్సెప్ట్‌తో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ల ఏర్పాటు అనివార్యమైంది. ఈ మేరకు ఇటీవలే సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి మండలి ఈ పాలసీపై విస్తృతంగా చర్చించింది. త్వరలోనే ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీని కార్యరూపంలోకి తీసుకువచ్చే దిశగా చర్యలను వేగిరం చేసింది. దేశంలో ఇప్పటి వరకు కేవలం మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ర్టాల్లోనే ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ ప్రక్రియ అమలులో ఉన్నది. మహారాష్ట్ర ప్రభుత్వం 2016లో ఈ పాలసీని తీసుకురాగా, గుజరాత్‌ ప్రభుత్వం 2006లోనే ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీని రూపొందించింది. 

టౌన్‌షిప్‌ల ఆవశ్యకత 

ఉద్యోగ ఉపాధి అవకాశాలలో నగర యువత కాలం విలువను గుర్తిస్తున్నది. తక్కువ ప్రయాణ సమయానికి ప్రాధాన్యం ఇస్తున్నది. తాము నివసించే ప్రాంతానికి దగ్గరలోనే పని ప్రదేశం ఉండాలని వారు ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా ‘వాక్‌-టు-వర్క్‌' కాన్సెప్ట్‌తో ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ ఉండనున్నది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ), కుడా (కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, వరంగల్‌), నుడా(నిజామాబాద్‌ యూడీఏ), సుడా (శాతవాహన యూడీఏ, కరీంనగర్‌), సుడా (స్తంభాద్రి యూడీఏ, ఖమ్మం)తోపాటు సిద్దిపేట్‌ అండ్‌ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, వైటీడీఐ (యాదాద్రి టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ), వీటీఏడీఏ (వేములవాడ) తదితర కార్పొరేషన్లలో టౌన్‌షిప్‌ల అభివృద్ధికి ప్రభుత్వం అనుమతించనున్నది. వ్యవసాయ భూములు, తడి పొలాల్లో వీటిని అనుమతించరు.

ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ అంటే?


100 ఎకరాలకంటే ఎక్కువ స్థలంలో కనీసం 1500 కుటుంబాలు సౌకర్యవంతంగా జీవించేలా ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లను నిర్మిస్తారు. కనీసం 2.50 లక్షల చదరపు మీటర్ల బిల్డప్‌ ప్రాంతం ఉండేలా చూస్తారు. సేంద్రియ వ్యర్థాల పునర్వినియోగం కోసం సాలీడ్‌ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ సిస్టంపై నిరంతర పర్యవేక్షణ ఉంచుతారు. విశాలమైన రహదారులు, క్రీడా మైదానాలు, పార్కులు, పార్కింగ్‌ స్థలాలు, సరస్సులు, వాక్‌వేలు ఉంటాయి. వినోదాత్మక కార్యక్రమాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వీటి రాకతో శివారు ప్రాంతాలు కూడా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతాయి.  

స్వాగతిస్తున్నాం.. 

ప్రభుత్వం తీసుకువస్తున్న ‘ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ-2020’ను స్వాగతిస్తున్నామని తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (టీడీఏ) అధ్యక్షుడు జీవీ రావు, కాన్పిడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) జనరల్‌ సెక్రటరీ వీ రాజశేఖర రెడ్డి చెప్పారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో నగరానికి నలు దిశలా రవాణా సౌకర్యం మెరుగైందనీ, దీంతో మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా కొత్తగా శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించడం శుభపరిణామమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ల అభివృద్ధికి దాదాపు 100 ఎకరాలుండాలన్న నిబంధన బాగున్నదనీ, శాటిలైట్‌ టౌన్‌షిప్‌లతో ఆయా ప్రాంతాల్లో గాలి, వెలుతురు బాగా ఉండటం వల్ల మెరుగైన జీవన విధానం ప్రజలకు సొంతమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. 


ప్రోత్సాహకాలు ఇవీ

క్రెడాయ్‌, ట్రెడా వంటి సంస్థలతోపాటు తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (టీడీఏ), ఇతర రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు కూడా ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లను ప్రోత్సహించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ల అభివృద్ధికి ప్రోత్సాహకాలను అందించే విషయమై ప్రభుత్వం చర్చిస్తున్నది. అభివృద్ధి చేసిన టౌన్‌

షిప్‌లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే, అలాంటి వారికి డెవలప్‌మెంట్‌ చార్జీలలో 90శాతం కేటాయింపులు ఉండనున్నాయి. సంబంధిత ఓసీల తేదీ నుండి ఐదేండ్ల కాలానికి ఉమ్మడి సదుపాయాలపై (క్లబ్‌ హౌజ్‌ తదితర) 100శాతం ఆస్తి పన్ను రాయితీ, ఇతర ఆస్తులపై 50 శాతం రాయితీ ఉండనున్నది. ఎల్‌ఐజీ/ఈడబ్ల్యూఎస్‌ గృహాలకు 50 శాతం మినహాయింపులు ఉంటాయి.  

ఇదీ ప్రభుత్వ లక్ష్యం..

  • నివాస ప్రాంతాలకు దగ్గర్లోనే కార్యాలయాలు ఉండేలా, ‘వాక్‌ టు వర్క్‌' లక్ష్యంగా ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు ఉండబోతున్నాయి. 
  • వ్యాపార, వాణిజ్య ప్రాంతాలు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలను అందుబాటులో ఉంచనున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, మురుగునీటి పారుదల సౌకర్యాలు, విద్యుత్‌, విద్య, వైద్య సదుపాయాలు, కమ్యూనిటీ హాల్స్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అక్కడ నివసించేవారితోపాటు పనిచేసేవారికీ మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉంచనున్నారు. ఎక్కువ ఓపెన్‌ (ఖాళీ) స్థలాలు, వాటిలో పచ్చదనం, తక్కువ ట్రాఫిక్‌ ఉండేలా చూస్తారు. 
  • ఇంటెగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ హైదరాబాద్‌ శివారు ప్రాంతాలతోపాటు ముఖ్యనగరాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడనున్నది. 
  • ప్రధానంగా నగరానికి ఉత్తరం వైపు, తూర్పు వైపున ఈ టౌన్‌షిప్‌లు శరవేగంగా ఏర్పాటు కానున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని కనీసం 100 ఎకరాలు, ఔటర్‌ రింగు రోడ్డుకు సమీప సరిహద్దు నుంచి కనీసం ఐదు కిలోమీటర్ల దూరంలో టౌన్‌షిప్‌లు రానున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లలో 40శాతం ఏరియా మౌలిక సదుపాయాల (10శాతం గ్రీనరీ , రోడ్లు, ఎస్టీపీలు, విద్యుత్‌ సబ్‌స్టేషను తదితర)కు కేటాయించాల్సి ఉంటుంది. 


logo