రంగారెడ్డి, మార్చి 11(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి విషయంలో హైడ్రామా నడుస్తున్నది. పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందంటూ పట్నం సునీతామహేందర్‌రెడ్డి భరోసాగా ఉండగా.. మరోవైపు కాంగ్రెస్ సీనియ ర్ నాయకుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన మొదటి జాబితాలోనే సునీతారెడ్డి పేరు ఉంటుందని అంతా భావించినా అధిష్ఠానం మాత్రం అభ్యర్థి ప్రకటనను వాయిదా వేస్తూ వ స్తున్నది. ఈ నేపథ్యంలోనే సోమవారం చేవెళ్లలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
పట్నం సునీతారెడ్డి, ఇతర కీలక నేతలు హాజరవ్వడంతోపాటు అందులో సునీతారెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతునిస్తూ నేత లు మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పేరుకు కార్యకర్తల విస్తృతస్థాయి మీటింగ్ అయినప్పటికీ.. బలనిరూపణ కోసమేనన్న ప్రచారం జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తుండడంతో పట్నం వర్గీయుల్లో ఒకింత టెన్షన్ నెలకొన్నది.
ఎంపీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నది. చేవెళ్ల నుంచి బరిలో నిలిచేందుకు బలమైన నాయకులు లేకపోవడంతో ఇటీవల వికారాబాద్ జడ్పీచైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కొద్దిరోజుల క్రితం చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ సభావేదికపైనే సీఎం రేవంత్‌రెడ్డి సునీతారెడ్డి పేరును ప్రకటిస్తారని అంద రూ భావించినా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నాలు గు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో చేవెళ్ల అభ్యర్థిగా ఆమె పేరు ఉంటుందని ప్రచారం జరిగినా తొలి జాబితాలో చోటుదక్కలేదు. సునీతారె డ్డి అభ్యర్థిత్వం విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం యూటర్న్ తీసుకుందన్న ప్రచా రం నేపథ్యంలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీచేసి ఓడిపోయిన కేఎల్ఆర్ పేరు కాంగ్రెస్ పెద్దల పరిశీలనలో ఉందన్న ప్రచారం జరుగుతున్నది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు చాన్స్ ఇవ్వొద్దని ఇప్పటికే అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో కేఎల్ఆర్కు అవకాశం వస్తుందా.? అన్నది ఆసక్తికరంగా మారింది. చేవెళ్ల రాజకీయాలు రోజుకోమలుపు తిరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరు కా కుండా మరో అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించినా..ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న టాక్ కూడా నడుస్తున్నది.
ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం రెండో జాబితాలో ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఈ మీటింగ్‌కు పట్నం సునీతామహేందర్రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి, వి కారాబాద్ జిల్లాల అధ్యక్షులు నర్సింహారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యుడు సత్యనారాయణరెడ్డి హాజరయ్యారు. చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, నవాబుపేట, శంకర్పల్లి మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు.
సీనియర్ నేతలు ఆహ్వానిస్తేనే కాంగ్రెస్‌లో చేరానని ఈ సందర్భంగా సునీతారెడ్డి స్పష్టం చేయగా..ఆమె గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డివిజన్ ఇన్చార్జి భరత్‌తోపాటు పలువురు నేతలు పిలుపునిచ్చారు. విస్తృతస్థాయి సమావేశమని నేతలు చెబుతున్నా.. పార్టీ నాయకత్వం అంతా సునీతకు మద్దతుగా ఉందని చాటి చెప్పేందుకే ఈ మీటింగ్ నిర్వహించారన్న టాక్ బాహాటంగా వినిపిస్తున్నది.
సునీతారెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఈ వేదిక నుంచి పార్టీ అధిష్ఠానానికి ఓ సంకేతం ఇచ్చినైట్లెందన్న చర్చ సైతం పార్టీ వర్గాల్లో జరుగుతున్నది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూ పుతున్న ఓ నేత నేడో, రేపో కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం నేపథ్యంలోనే ఈ మీటింగ్‌ను నిర్వహించారని సమాచారం. ఏదిఏమైనా చేవెళ్ల ఎంపీగా పోటీ చేసే చాన్స్ ఆ పార్టీ అధిష్ఠానం ఎవరికి ఇస్తుందో! తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.