సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): మొన్న అలకానంద కిడ్నీ రాకెట్.. నేడు ఐవీఎఫ్, సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్.. నగరంలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు వైద్య, ఆరోగ్యశాఖ అవినీతికి, నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఈ రెండు సంఘటనలు కూడా బాధితులు, ఇతరుల ఫిర్యాదుతో మాత్రమే బయటపడ్డాయంటే రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పనితీరును అర్థం చేసుకోవచ్చు. ఒక వేల ఈ ఫిర్యాదులు అందకపోతే యథేచ్ఛగా అటు అంగట్లో అవయవాలు, ఇటు ఐవీఎఫ్, సరోగసి ముసుగులో శిశువుల విక్రయం కొనసాగేది.
అవయవాల విక్రయాలు, అక్రమ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్స్, లింగ నిర్ధారణ, ఎలాంటి అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఐవీఎఫ్, గుట్టుచప్పుడు కాకుండా సరోగసి, శిశు విక్రయాలు వంటివన్నీ యథేచ్ఛగా సాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరు అధికారుల తీరు దొరికితే దొంగలు లేకపోతే దొరల్లా మారింది.
లక్షల్లో పెట్టుబడులు పెట్టి, పైరవీలతో పోస్టింగ్‌లు పొంది, పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునేందుకు సంవత్సరాల తరబడి ఉన్నచోటనే తిష్టవేసి, రాబడిపైనే దృష్టిపెడుతున్న కొందరు అధికారులకు జరుగుతున్న అక్రమాలపై దృష్టి పెట్టే తీరక దొరకడం లేదని జనం మండిపడుతున్నారు. మొన్న జరిగిన కిడ్నీ రాకెట్ గాని, తాజాగా వెలుగులోకి వచ్చిన ఐవీఎఫ్, సరోగసి ఉదంతాలు ఇంత కాలం యథేచ్ఛగా సాగుతున్నా సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులకు తెలియదంటే అది వారి నిర్లక్ష్యమా లేక నిర్వాహకులతో ఉన్న చీకటి ఒప్పందమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గతంలోనూ పలు ఫిర్యాదులు..
సికింద్రాబాద్‌లోని ‘యూనివర్సల్ సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌పై గతంలో కూడా పలు ఫిర్యాదులు రావడం, వ్యవహారం పోలీసు కేసులు, కోర్టు వరకు వెళ్లడంతో 2021లోనే ఆ సెంటర్‌ను మూసివేశారు. కానీ ఆ మూసివేత అనేది కేవలం డీఎంహెచ్‌వో కార్యాలయంలోని కాగితాల్లోనే. నిర్వాహకురాలు యథేచ్ఛగా అదే సెంటర్లో గత నాలుగేండ్లుగా ఐవీఎఫ్, సరోగసి పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నా తమకు తెలియదని సంబంధిత అధికారులు చెప్పడంపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేండ్లుగా ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం ఉన్న ప్రాంతంలోనే మూసివేసిన ఫెర్టిలిటీ సెంటర్ యథేచ్ఛగా కొనసాగుతుంటే సంబంధిత అధికారులకు తెలియదంటే అది వారి నిర్లక్ష్యానికి నిలువుటద్దం లేదా నిర్వాహకులతో వారికి ఉన్న చీకటి ఒప్పందం కావొచ్చని జనం మండిపడుతున్నారు.
కొరవడిన పర్యవేక్షణ ..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఉన్న ఫెర్టిలిటి, సరోగసి సెంటర్లపై అటు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు.. ఇటు కుటుంబ సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణ గాని సరిగ్గా లేకపోవడంతోనే గ్రేటర్లో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఏదైనా ఘటనలు జరిగినప్పుడే హడావుడి చేయడం, ఆ తర్వాత వాటివైపు కన్నెత్తి చూడకపోవడంతో సెంటర్ల నిర్వాహకులు యథేచ్ఛగా సంతానం లేని దంపతులను మోసగిస్తున్నారు. నగరంలోని చాలా సెంటర్లలో సంతానం కోసం తప్పించే దంపతుల సెంట్మెంట్ను ఆసరాగా చేసుకుని కొందరు నిర్వాహకులు అనధికారికంగా సరోగసి ద్వారా సంతానం కల్పిస్తూ రూ. కోట్లు గడిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
చట్టపరంగా వెళ్తే సవాలక్ష నిబంధనలు, నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగడం వంటి సమస్యలు ఎదురవుతుండడంతో కొందరు దంపతులు సైతం అక్రమాలకు పాల్పడే సెంటర్ల నిర్వాహకులనే ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. దీనిని ఆసరాగా చేసుకుని ఆయా సెంటర్ల నిర్వాహకులు రూ. లక్షల్లో డబ్బు వసూలు చేసి ఎలాంటి నిబంధనలు పాటించకుండా అక్రమ పద్ధతిలో సరోగసి లేదా ఐవీఎఫ్ ద్వారా సంతానం కల్పిస్తున్నట్లు సమాచారం. అయితే సంబంధిత అధికారులు ఈ సెంటర్లను కనీసం నెలకు ఒకసారైనా తనిఖీ చేసిన పాపాన పోలేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 126 ఏఆర్టీ, సరోగసి క్లినిక్స్, రంగారెడ్డి జిల్లా పరిధిలో 47 క్లినిక్స్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో 40 క్లినిక్స్ ఉండగా వీటిపై సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ శూన్యమని తెలుస్తున్నది.
అధికారులు, సిబ్బంది అవినీతి కారణంగా..!
అవయవాల వ్యాపారం లేదా అక్రమ సరోగసి, ఐవీఎఫ్ ముసుగులో శిశువుల రవాణా వంటి వ్యవహారాలన్నింటికీ కొందరు సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్వాహకుల వద్ద నుంచి వాటాలు తీసుకుంటూ పూర్తి సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొక్కుబడి తనిఖీలు చేస్తూ ఇచ్చిన ముడుపులు తీసుకుని అక్కడ జరిగే వ్యవహారాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నట్లు పలువురు మండిపడుతున్నారు. ఏదైన ఘటన జరిగినప్పుడు నాలుగు రోజులు హడావుడి చేయడం, ఆ తరువాత యథావిధిగా నిర్వాహకులకు సహకరించడం ఆరోగ్యశాఖలో పరిపాటిగా మారిందనే ఆరోపణలు లేకపోలేదు. ఏదైనా క్లినిక్స్‌పై ఫిర్యాదులు వచ్చినా స్పందించరు.
చర్యలు తీసుకోరు. పై నుంచి ఆదేశాలు, ఒత్తిడి వస్తే తప్ప చర్యలు తీసుకోరు. ఫిర్యాదులు వచ్చిన సెంటర్లపై విచారణ చేయరు. కేసులు నమోదైన తరువాత వాటి వంక మళ్లీ చూడరు. ఈ విధమైన అధికారుల వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుని సృష్టి వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 2021లో మూసివేసిన సృష్టి ఫెర్టిలిటి సెంటర్‌పై అధికారులు కనీసం ఏడాదిలో ఒకసారైన దృష్టి పెట్టి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావంటున్నారు ప్రజలు. సృష్టి అక్రమాలకు వందల మంది దంపతులు మోసపోయినట్లు తెలుస్తున్నది.