బషీరాబాద్ మండలంలోని జీవన్గి గ్రామ మహాదేవలింగేశ్వరాలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాశివరాత్రి జాతర ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా , ఉత్కంఠగా సాగాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పోటీదారులు వచ్చారు. దాదాపు నాలుగు గంటలపాటు ఎంతో ఉత్కంఠగా జరిగిన పోటీల్లో చివరకు కర్ణాటకకు చెందిన యువకుడు విజేతగా నిలిచాడు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జీవన్గిలో వెలసిన మహాదేవలింగేశ్వరాలయంలో కుస్తీ పోటీలు నిర్వహించడం ప్రతిఏటా ఆనవాయితీగా వస్తున్నది. వేలాది మంది జనం ఈ పోటీలను వీక్షించేందుకు తరలివచ్చారు.
టెంకాయతో ప్రారంభమైన ఈ పోటీలు వెండి కడియంతో ముగిశాయి. చిన్న వారు చిన్న వారితో.. పెద్ద వారు పెద్దవారితో విడివిడిగా కుస్తీపట్లు పడ్డారు. ఫైనల్లో కర్ణాటకకు చెందిన సిద్ధు, మహారాష్ట్రకు చెందిన సంతోష్‌పాటిల్ తలపడగా సిద్ధు విజేతగా నిలిచాడు. ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెండి కడెంను బహుమతిగా ఇచ్చి ఘనంగా సన్మానించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ నారాయణ, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
ఉత్సవంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్, తహసీల్దార్ వెంకటేశ్, ఆలయ కమిటీ చైర్మన్ మునిందర్‌రెడ్డి, గ్రామ పెద్దలు మాణిక్‌రెడ్డి, పార్వత్రెడ్డి, వెంకట్‌రెడ్డి, నర్సిరెడ్డి, వీరారెడ్డి, వెంకట్‌రెడ్డి, మల్లికార్జున్, రాములు, బస్సప్ప, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. కాగా ఆలయ జాతర సందర్భంగా ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న కలశాన్ని శుక్రవారం వేలం వేయగా బషీరాబాద్‌కు చెందిన ఆర్తి రూ. 1,05,000 దక్కించుకున్నారు.
-బషీరాబాద్, ఫిబ్రవరి 28