వికారాబాద్ మార్చి 20 : అంగన్వాడీ పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగ, వయోవృద్ధుల శాఖ ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పిల్లల అంగవైకల్యం, తదితర అంశాలపై సీడీపీవోలు, సూపర్వైజర్లు, సఖి, ఐసీపీఎస్ అధికారులు, సిబ్బందితో ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. పిల్లలను వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో మాత్రమే పంపించాలని సూచించారు. పిల్లల జీవితాలను మెరుగుపర్చేందుకు శారీరక వైకల్యం, ఫిట్స్, ఉబ్బసం, ఆకస్మిక కదలికలు, స్పృహ తప్పడం, వినికిడి సమస్య, కారణం లేకుండా శిశువు ఏడ్వడం, మానసిక సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్స చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సామ్, మామ్ పిల్లలు లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
జిల్లాలో బాల్యవివాహాలు జరుగకుండా చర్యలు తీసుకుంటూ, బాల్య వివాహాలపై సమాజంలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అనాథాశ్రమాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు. పిల్లలకు మంచి అలవాట్లపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అంగన్వాడీలో మెరుగైన సౌకర్యాల కోసం టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్‌కు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించినట్లయితే పరిష్కారిస్తామని తెలిపారు.
ముందుగా కలెక్టర్ ప్రతీక్‌జైన్, సంబంధిత అధికారులతో కలిసి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లోని వివిధ సమస్యలతో బాధపడే 140 మంది పిల్లల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. గ్రామాల్లో గృహాలను సందర్శించి వారం రోజుల్లో అనారోగ్యంతో కూడిన పిల్లల వివరాలను సేకరించి శస్త్ర చికిత్సల కోసం కృషి చేయాలని వైద్యాధికారులకు సూచించారు. 6 సంవత్సరాల లోపు పిల్లల పెరుగుదల, ఎదుగుదలకు అధికారులు కృషి చేయాలని ఆమె తెలిపారు. సమీక్షా సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ శాఖ డైరెక్టర్ శైలజ, ఆర్జేడీ మోతి, రాష్ట్ర సీడీపీవో అరుణ, డీపీవో జయసుధ, మానసిక వైద్యులు పాల్గొన్నారు.