విఘ్నాలు తొలగించే ఆది దేవుడు.. వినాయక చవితిని శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా జనం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పల్లె, పట్టణాలు, యువజన, కుల సంఘాలు, కాలనీల్లో ప్రతిష్ఠించిన గణనాథులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాలు, ఇండ్లల్లో విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. కుడుములు, పులిహోర, ఉండ్రాళ్ల పాయసాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజల్లో పాల్గొనగా, ఈ ఏడాది పంటలు బాగా పండాలని అన్నదాతలు, వ్యాపారాలు వృద్ధి చెందాలని వ్యాపారులు, తమకు చదువు బాగా అబ్బాలని విద్యార్థులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. విద్యుత్తు దీపాలతో జిగేల్ మనేలా మండపాలను అలంకరించారు. గణేశ్ ప్రతిమలు వివిధ రూపాల్లో దర్శనమివ్వడంతో జనం భక్తిపారవశ్యంలో మునిగితేలారు.
– న్యూస్ నెట్వర్క్ నమస్తే తెలంగాణ