భక్తిశ్రద్ధలతో గురువారం రాత్రి కాముడి దహనం
ఉమ్మడి జిల్లాలో ఘనంగా హోలీ పండుగ
పాల్గొన్న ప్రజాప్రతినిధులు
అంబరాన్నంటిన సంబురాలు
ఆనందోత్సవాలతో చిన్నారులు, యువత కేరింత
పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు
రంగులమయంగా మారిన పల్లెలు, పట్టణాలు
వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
డీజేలు ఏర్పాటు చేసి డ్యాన్స్‌లు చేసిన యువకులు
న్యూస్ నెట్వర్క్, మార్చి 18, నమస్తే తెలంగాణ;రంగుల కేళీతో ఊరూవాడ సందడిగా మారింది. గురువారం రాత్రి భక్తిశ్రద్ధలతో కాముడిని దహనం చేసిన ఉమ్మడి జిల్లా ప్రజలు.. శుక్రవారం హోలీ పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకొన్నారు. ముఖ్యంగా చిన్నారులు, యువత ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. వికారాబాద్‌లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగిలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, ఆమనగల్లులో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. కరోనా కారణంగా రెండేండ్లుగా రంగుల పండుగకు దూరంగా ఉన్న జనం ఈసారి ఊరువాడలను కలర్లతో ముంచెత్తారు. బకెట్లు, మగ్గులు, సీసాల్లో రంగునీళ్లు కలుపుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఆడిపాడారు. చిన్నారులు రంగుల గన్ చేతపట్టుకుని చల్లుకుంటూ హ్యాపీ హోలీ అంటూ కేరింతలు కొట్టారు. కొందరు కొడిగుడ్లు, టమాటాలను కొట్టుకుంటూ భలే ఎంజాయ్ చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఊరూరా రంగుల పండుగ కలర్ఫుల్గా జరిగింది. హోలీ సంబురాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గంలోని మండల కేంద్రాలు, పట్టణాలు, పల్లెల్లో శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా చిన్నారులు, యువత, పెద్దలు, మహిళలు అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించారు. రంగులు చల్లుకుని ఆనందం వ్యక్తం చేశారు. యువకులు డీజేలను ఏర్పాటు చేసి డ్యాన్స్‌లు చేశారు. గురువారం రాత్రి గ్రామాల్లో కామదహనం చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.