పరిగి, మే 8 : రాష్ట్రంలో ఏ డిపోనూ ఎత్తివేయడం లేదని, పాలనాపరంగా కొన్ని బస్సులు, కొందరు ఉద్యోగులను ఇతర డిపోలకు బదిలీ చేయవచ్చు తప్ప ఏ ఒక్క డిపోనూ మూసివేయడం లేదని టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ స్పష్టం చేశారు. ఆదివారం పరిగిలోని ఆర్టీసీ డిపో, బస్టాండ్లను సంస్థ ఎండీ సజ్జనార్ సందర్శించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. సంస్థకు చెందిన బస్సులు పాతవయ్యాయని, 1016 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించిందని చెప్పారు. హైదరాబాద్‌లో, గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, 300 వాహనాలు, అవసరమైతే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థలతో ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఈ మధ్య సంస్థ ఆదాయం సైతం కొంత పెరిగిందని, రాబోయే రోజుల్లో కొత్త రూట్లను ఎంపిక చేసి కొత్త సర్వీసులను నడిపిస్తామని చెప్పారు. బెంగుళూరు, వైజాగ్, ముంబయి, చెన్నై, తిరుపతి, పూణెలకు స్లీపర్, ఏసీ, నాన్ ఏసీ బస్సులను నడిపించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.
ఆర్టీసీని ప్రోత్సహిస్తున్నారు..
ఐదారు నెలల నుంచి ప్రజలందరూ ఆర్టీసీని ప్రోత్సహిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ బాగా పెరిగిందన్నారు. సంస్థ వంతుగా మెరుగైన సేవలు అందించేందుకు అన్ని రూట్లను రేషనలైజేషన్ చేశామని, ఎక్కడ సేవలు అవసరమో అక్కడ కొత్త సర్వీసులను ప్రారంభించనున్నామన్నారు. కర్నాటక రాష్ట్ర ఆర్టీసీతో చర్చలు జరుపుతున్నామని, గుల్బర్గా, యాద్గిర్, గుర్మిట్కల్లకు ఎక్కువ బస్సులు నడిపిస్తామన్నారు.
సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు మేలు
ప్రజలు సురక్షితంగా, సంతోషంగా ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని, గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటున్నారని చెప్పారు. అక్కడక్కడ కొందరు ద్విచక్ర వాహనాలపై హైదరాబాద్‌కు సైతం దూర ప్రాంతాల నుంచి వస్తున్నారని, ఇది సురక్షితం కాదన్నారు. చాలాసార్లు నష్టం జరిగింది, అలాంటి పరిస్థితి తెచ్చుకోరాదని ఆయన సూచించారు. పరిగిలో ఆర్టీసీకి గల స్థలాన్ని సైతం ఉపయోగించేందుకు ఆలోచనలు చేస్తున్నామని, వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. బస్టాండ్లలో ఫార్మసీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం ప్రయాణికుల ద్వారా ఆదాయం కాకుండా ఇతర రకాలుగా ఆదాయం పెంపొందించుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అసత్య ప్రచారాలను నమ్మవద్దు
పరిగిలోని ఆర్టీసీ స్థలాన్ని ఎవరికీ లీజుకు ఇవ్వలేదని, అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మరాదని ఆయన సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని గౌరవంగా భావించాలన్నారు. ప్రతి గురువారం బస్ డే అని పాటిస్తున్నామని, ప్రజలు సైతం వారానికి ఒకరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఆయన చెప్పారు. ఆర్టీసీలో 30 శాతం అద్దె బస్సులు, 70శాతం సంస్థ బస్సులున్నాయని, ఈసారి కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో సంస్థ బస్సుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. ఎక్కడా ఉద్యోగులను వీఆర్ఎస్ కోసం ఒత్తిడి చేయడం లేదని, తాను సంగారెడ్డి, జహీరాబాద్, వరంగల్‌కు వెళ్లిన సందర్భంలో చాలామంది తననే అడిగారని, ఆరోగ్య సమస్యతో వీఆర్ఎస్కు ముందుకు వస్తున్నారని, అలాంటివారికి వీఆర్ఎస్ పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు. డీవీఎం, డీఎం బాగా పనిచేస్తున్నారని, ఆదాయం, కేఎంపీఎల్ సాధనలో చక్కగా పనిచేస్తున్నారని ఆయన అభినందించారు. డిపో ఆదాయం పెంపునకు సంబంధించి పలు సూచనలు చేశారు. డిపో ఆవరణలో ఎండి సజ్జనార్ మొక్క నాటి నీరు పోశారు. అంతకుముందు ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించిన ఆయన ఆర్టీసీకి ఎంత స్థలం ఉన్నది వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌లోని మరుగుదొడ్ల డోర్లు మార్పించాలని సూచించారు. నీరు వస్తున్నాయా అని ఆయన పరిశీలించారు.
దుకాణాల సముదాయం నిర్మాణంపై చర్యలు చేపడుతాం
పరిగిలోని ఆర్టీసీ స్థలంలో దుకాణాల సముదాయం నిర్మాణంపై వెంటనే చర్యలు చేపడుతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డికి హామీ ఇచ్చారు. పరిగి డిపోను సందర్శించిన సజ్జనార్‌ను ఎమ్మెల్యే కలిసి పలు అంశాలపై చర్చించారు. పరిగిలోని గంజ్‌రోడ్డులో గల ఆర్టీసీ స్థలంలో దుకాణాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు మీ దగ్గర ఉన్నాయని, వెంటనే పరిశీలించి ఆమోదించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ మేరకు దుకాణాల వారు ఎంత డిపాజిట్ చేయాలి తదితర అన్ని అంశాలను నిర్ణయించారని, వెంటనే చర్యలు చేపడితే దుకాణాలను నిర్మించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రెండుమూడు రోజుల్లో సమావేశం ఉందని, తప్పనిసరిగా ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. పరిగిలోని ఆర్టీసీ స్థలాన్ని తాను ఎవరికో లీజుకు ఇప్పించినట్లుగా కొందరు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకువెళ్లగా అలాంటిదేమీ లేదని, ఎవరికీ లీజుకు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. తన తండ్రి హరీశ్వర్‌రెడ్డి సర్పంచ్‌గా ఉన్న సమయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్టీసీ డిపో, బస్టాండ్ నిర్మాణం చేయించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్వర్‌రెడ్డి ఆరోగ్యంపై సజ్జనార్ ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీవీఎం జ్యోతి, డిపో మేనేజర్ పవిత్ర, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
వివాహ వేడుకలో రక్తదానం
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బంగరి రామస్వామి ఆదివారం పరిగిలోని బృందావన్ గార్డెన్లో జరిగే తన వివాహానికి సజ్జనార్‌ను ఆహ్వానించాడు. తాండూరు జిల్లా దవాఖాన ఆధ్వర్యంలో పెండ్లి మండపం ఆవరణలోనే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాడు. ఈ వివాహానికి హాజరైన సజ్జనార్‌తోపాటు పెండ్లికొడుకు రామస్వామి రక్తదానం చేశారు. వారి స్ఫూర్తితో మరో 28 మంది, మొత్తం 30 మంది రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఎమ్మెల్యే మహేశరెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు.