దోమ,నవంబర్ 10 : ప్రభుత్వ పాఠశాలకు దాతలు సహకారం అందించడం అభినందనీయమని ఎంఈవో వెంకట్ అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని దిర్సంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు స్నేహ ఫామ్ పౌండేషన్ చైర్మన్ రాంరెడ్డి లక్ష రూపాయల విలువైన ఎల్జి టీవీని అందజేశారు. టీవీని ఫౌండేషన్ సభ్యుడు సురెష్రెడ్డి సోమవారం ఎంఈవో వెంకట్‌తో కలిసి పాఠశాల హెచ్ఎం కేశవులుకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువులకు సహకరించి సాయం అందించిన ఫౌండేషన్ చైర్మన్ రాంరెడ్డి వారి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలకు దాతలు తోచిన సహాయం అందజేసి విద్యార్థుల అభ్యున్నతికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి రాజేష్,హైస్కూల్ హెచ్ఎం శివకుమార్,పాఠశాలల చైర్మన్లు గ్రామ పెద్దలు కొండారెడ్డి, హన్మంతు, వెంకట్రాములు, బందెయ్య, తదితరులు పాల్గొన్నారు.