షాద్‌నగర్, మే 1: రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు..పని చేస్తే కానీ అందని మెతుకులు.. రెక్కల కష్టం చేద్దామన్నా దొరకని పను లు.. ఉపాధిని వెతుక్కుంటూ వివిధ రాష్ర్టాలకు వలసలు.. ఇవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించిన.. కదిలించిన దృశ్యాలు. కానీ తెలంగాణ ఏర్పడి సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. స్థానికంగా ఉన్నవారికి మాత్రమే కాదు.. ఇతర రాష్ర్టాల వారికి కూడా ఇక్కడ ఉపాధి లభిస్తున్నది. ఒకప్పుడు వలసలకు కేరాఫ్‌గా మారిన ప్రాంతానికి ప్రస్తుతం ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది కార్మికులు వలసలు వస్తున్నారు. పారిశ్రామిక ప్రగతితో టీఆర్ఎస్ ప్రభుత్వం షాద్‌నగర్ నియోజకవర్గ రూపురేఖలనే మార్చేసిందని వలస కార్మికులు ఆనందపడుతున్నారు. సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్- ఐపాస్‌తో రంగారెడ్డి జిల్లాలో వందల సంఖ్యలో పరిశ్రమలు వెలుస్తున్నాయి. ఫలితంగా కార్మికులకు ఉపాధి లభిస్తున్నది.
నాడు ఇతర ప్రాంతాలకు ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో ఎంతో నష్టపోయింది. స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని అప్పటి నాయకులు చర్యలు తీసుకున్నా గత సీమాంధ్ర పాలకులు ఆశించిన స్థాయిలో శ్రద్ధ చూపకపోవడంతో ఇతర ప్రాంతాలకు ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక షాద్‌నగర్ పట్టణం వ్యాపార రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందినా స్థానికులకు ఉపాధి లభించలేదు. రాజధానికి అత్యంత సమీపంలో ఉండటమే కాకుండా, 44వ జాతీయ రహదారితోపాటు రైలు సౌక ర్యం ఉన్నా సీమాంధ్ర పాలకులు అభివృద్ధికి సహకరించలేదు. 1976 లో అప్పటి సీఎం జలగం వెంగళ్రావు కొత్తూరు మండల కేంద్రాన్ని పారిశ్రామిక ప్రాంతంగా గుర్తించి, పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీనికి తోడు షాద్‌నగర్, కొందర్గు, కేశంపేట మండలాలతోపాటు స్థానికంగా భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు వెలిశాయి.
ప్రస్తుతం కొత్తూరు, షాద్‌నగర్ పారిశ్రామిక వాడల్లో సుమారు 200 లకు పైగా పరిశ్రమలు కొనసాగుతున్నాయి. వీటికి దీటుగా కొందుర్గు, కేశంపేట, నందిగామ మండలాల్లోనూ పారిశ్రామిక రంగం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నది. ఈ పరిశ్రమల్లో ప్రపంచస్థాయి గుర్తిం పు పొందిన పీ అండ్ జీ కాస్మోటిక్స్ పరిశ్రమ, ఫార్మా, వస్ర్తాలు, ముడి ఇనుము, చమురు, లెదర్, ఫైబ ర్, తినుబండారాల తయారీ వంటి పరిశ్రమలున్నాయి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలో పారిశ్రామిక రంగం కుంటుపడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి షాద్‌నగర్ ప్రాంతం లో 50శాతం మేర పరిశ్రమలు మూతపడ్డాయి. వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. వారిని గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు పట్టించుకోలేదు. కానీ నేడు సీఎం కేసీఆర్ పాలనలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. టీఎస్-ఐపాస్‌తో జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వెలుస్తున్నాయి. వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చినట్లు కార్మి క సంఘాల నేతలు, కార్మిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
వందల సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటు..
షాద్‌నగర్ ప్రాంతం పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడి పారిశ్రామిక వాడలో చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు వందల సంఖ్యలో ఉన్నాయి. అందులో బ్యాటరీలు, ఫార్మా, ముడి ఇనుము, వంటనూనెలు, చాక్లెట్, బిస్కెట్, టెక్స్టైల్, వ్యవపాయ రంగ పరిశ్రమలతోపాటు పలు ఇతర పరిశ్రమలు వెలిశాయి.
ప్రతిరోజూ వేలాదిమంది కార్మికులు ఉపాధిని పొందుతున్నారు. ఇక్కడ స్థానికులతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన ఎంతోమంది పలు పరిశ్రమల్లో విధులను నిర్వహిస్తున్నారు.
కర్ణాటక, తమిళనాడు, బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ర్టాలకు చెందిన కార్మికులు వేలాదిగా ఇక్కడికి వలస వచ్చి ఉపాధిని పొందుతున్నారు. వారితోపాటు నేపాల్ దేశానికి చెందిన పలువురు కార్మికులు కూడా స్థానికంగానే ఉంటూ పలు పరిశ్రమల్లో పనిచేస్తూ జీవిస్తున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారు 180కి పైగా పరిశ్రమలున్నాయి. వాటిలో ప్రస్తుతం 60 వేలమందికి పైగా ప్రతిరోజూ పనిచేస్తున్నారు. గతంలో 20 వేల నుంచి 25 వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తుండే వారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం అదనంగా 30 వేలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వారితోపాటు వందల సంఖ్యలో రోజువారీ కూలీలు కూడా ఉపాధిని పొందుతున్నారు. పరిశ్రమలు అధికంగా ఉండటంతోనే ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరిగాయని కార్మికులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పిస్తా..
షాద్‌నగర్ ప్రాంతంలో మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నా. ఇప్పటికే ఉన్న పరిశ్రమల్లో వేలాది మందికి ఉపాధి లభిస్తున్నది. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పలువురు నిర్వాహకులు ముందుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పరిశ్రమల ఏర్పాటుకు ఎం తో కృషి చేస్తున్నారు. పని చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికీ ఇక్కడ పని దొరుకుతున్న ది. త్వరలో ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా. -అంజయ్యయాదవ్, ఎమ్మెల్యే, షాద్‌నగర్
మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా..
మా ప్రాంతంలో యువతకు సరైన ఉపాధి అవకాశాల్లేవు. గత నాలుగేండ్లుగా షాద్‌నగర్ ప్రాంతంలోని ఓ పరిశ్రమలో మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా. నాతోపాటు మా రాష్ర్టానికి చెందిన వారు వందలాది మంది ఈ ప్రాంతంలోని పలు పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధిని పొందుతున్నారు.
– శివాజీ, కార్మికుడు, బీహార్ రాష్ట్రం