బడంగ్‌పేట : రాష్ట్రంలో అసమర్ద పాలన నడుస్తోందని, ఇచ్చిన హమీలను అమలు చేయడంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Reddy ) ఆరోపించారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి(CM Relief fund) నుంచి వచ్చిన 35 షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధి దారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి అనేక తప్పుడు వాగ్దానాలు చేసిందని విమర్శించారు. మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి, ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇస్తామన్న రూ. 2, 500లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీకి సంబంధించి ఎంత మందికి చేశారో సరైన లెక్కలు లేవన్నారు. అన్ని తప్పుడు వాగ్దానాలు, తప్పుడు లెక్కలతో కాలం వెల్లదీస్తుందని మండిపడ్డారు.
ప్రజలను మోసం చేయడమే తప్ప మంచి చేయడం రాదన్నారు. సూపర్ సిక్స్ గ్యారంటీల ( Super Six Guarantees) సంగతి తేల్చకుండా ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ రఘుకుమార్, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు ఉన్నారు.