బొంరాస్పేట : కురుస్తున్న భారీ వర్షాలకు బొంరాస్పేట పెద్ద చెరువు పూర్తిగా నిండి బుధవారం నుంచి అలుగు పారుతున్నది. వరుసగా రెండో ఏడాది కూడా చెరువు నిండి అలుగు పారడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా వర్షాలు ఆశాజనకంగా కురువడంతో చెరువు నిండింది. చెరువు కింద గత ఏడాది యాసంగిలో 800 ఎకరాలు వరి పండించగా ప్రస్తుతం వానకాలంలో కూడా అంతే మొత్తంలో వరినాట్లు వేశారు. యాసంగి పంటలకు కూడా నీరందు తుం దని రైతులు సంతోషంతో ఉన్నారు. మండలంలోని మెట్లకుంట, బురాన్పూర్, వడిచెర్ల, కొత్తూరు, తుంకిమెట్ల చెరువులు కూడా నిండడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా బొంరాస్పేట చెరువు అలుగు హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పక్కనే ఉండడంతో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఐతే ఇటీవల వాగులు, వంకలు దాటుతూ జిల్లాలో పలువురు మృత్యువాత పడడంతో పోలీసులు ముందు జాగ్రతగా అలుగును సందర్శించకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రజలు దూరం నుంచే అలుగు అందాలను తిలకిస్తున్నారు.