పరిగి : కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి సూచించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా ప్రజలు సామాజిక బాధ్యతగా భావించి మాస్క్‌లు ధరించి, శానిటైజర్లు వాడి ఆనందమైన నూతన సంవత్సరాన్ని ఆరోగ్యవంతంగా జరుపుకోవాలని ఎస్పీ కోరారు. రిసార్టులు, ఫామ్‌హౌస్‌లపై ప్రత్యేక నిఘా ఉంటుందని, వాటిలో ఎలాంటి అశ్లీల కార్యక్రమాలు జరపకూడదన్నారు. డిసెంబర్ 31వ తేదీ అర్దరాత్రి సమయంలో నూతన సంవత్సరం వచ్చిన సందర్భంగా ఎవరు బైక్ ర్యాలీలు నిర్వహించరాదని, ర్యాలీలకు అనుమతి లేదన్నారు.
జనవరి 2వ తేదీ వరకు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం ఉందని తెలిపారు. డిజె, సౌండ్‌బాక్స్‌లు, పెద్ద శబ్దాలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. జిల్లా పరిధిలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి సమయంలో 40చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.