బషీరాబాద్ : రియాలర్టర్ల అగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది. వారి పనులకు అడ్డొచ్చేది ఏదైనా సరే ధ్వంసం చేసుకుంటూ పోవడమే వారి పని. అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా వారి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోవడమే వారి ప్రత్యేకత. ఓ రియాల్టర్ తన భూమిలోకి వెళ్లేందుకు ఏకంగా ఎత్తిపోతల ప్రధాన కాలువను ధ్వంసం చేయడం గమనార్హం. మండల పరిధిలోని నవాంద్గి ఎత్తిపోతల పథకం కింద ఉన్న సర్వే నం. 54లో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రధాన కాలువను నిర్మించింది. అయితే ఓ రియాల్టర్ సదరు కాలువను జేసీబీ సహాయంతో ధ్వంసం చేసి తన భూమిలోకి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఎత్తిపోతల పథకం కింద ఉన్న ఆయకట్టు రైతులు వాపోయారు.
పనులు ఆపకపోతే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఇటీవల రూ. కోటి 80లక్షలను మంజూరు చేసి మరమ్మతులు చేస్తే, రియాల్టర్ ప్రధాన కాలువను ధ్వంస్వం చేసి ఆయకట్టుకు సాగునీరు అందకుండా చేశాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.