కొడంగల్, ఆగస్టు 14 : దేశానికి పట్టుగొమ్మలు పల్లెలు ప్రగతిలో ముందుకెళ్తేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని వికారాబాద్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం మండలంలోని చిట్లపల్లి, టేకల్లోకడ్, హుస్సేన్‌పూర్ గ్రామ పంచాయతీ భవనాలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించిందని, రూ.20 లక్షల వ్యయంతో నూతన పంచాయతీల భవన నిర్మాణాలను చేపట్టి ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. గ్రామ ప్రజలకు పూర్తి పాలన అందించేందుకు పంచాయతీ భవనాలు అవసరమని, సమస్యలుంటే పరిష్కరించుకోవచ్చన్నారు.
అనంతరం మున్సిపల్ పరిధిలోని బాలాజీనగర్ వీధిలో పాఠశాల భవన నిర్మాణం కోసం ఎస్డీఎఫ్ ఫండ్ నుంచి రూ.70 లక్షల అంచనా వ్యయంతో భవన నిర్మాణం చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో శుభ్రత పాటించేలా చూడాలన్నారు. అనంతర నూతనంగా ప్రారంభించిన గ్రామ పంచాయతీ భవన ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కడ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, మున్సిపల్ కమిషన్ బలరాం నాయక్, ఎంపీడీవో ఉషశ్రీ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉషరాణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, మాజీ ఎంపీటీసీ ఏన్గుల భాస్కర్, మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ మేనేజర్ ఆంజనేయులు, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మురళీధర్‌తో పాటు అయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలకు పెద్దపీట..
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం మండలంలోని లింగంపల్లి, నాందర్పూర్, కొత్తూరు గ్రామాల్లో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను, పల్లె దవాఖానను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పంచాయతీ భవనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కొడంగల్ కాంగ్రెస్ ఇన్చార్జి తిరుపతి రెడ్డి, కడ ప్రత్యేకఅధికారి వెంకట్ రెడ్డి, ఎంపీడీవో వెంకన్‌గౌడ్, ఎంపీవో మహేష్, కాంగ్రెస్ నాయకులు నర్సింహులు గౌడ్, రాంచంద్రా రెడ్డి, రాజేశ్‌రెడ్డి పాల్గొన్నారు.