వికారాబాద్, ఫిబ్రవరి 25 : జిల్లాలో జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. మంగళవారం సమావేశం హాలులో విద్యా శాఖ ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, మండల విద్యాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమవుతాయని, జిల్లాలో 69 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగిందన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులందరూ పరీక్షా కేంద్రాలను ఒక రోజు ముందుగానే సందర్శించి, ప్రతిరోజూ ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సిందిగా సూచించారు. విద్యార్థులు, పరీక్షలను నిర్వహించే అధికారులు, సిబ్బంది ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు, సెల్ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాకూడదని సూచించారు. పరీక్ష కేంద్రంలో, పరిసరాల్లో సెల్ఫోన్లను పూర్తిగా నిషేధించినట్లుగా తెలిపారు. 6450 మంది బాలురు, 6453 మంది బాలికలు మొత్తం 12903 మంది పరీక్షలు రాస్తున్నారని తెలిపారు.
ఎక్కడ కూడా చిన్న సమస్య రాకుండా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వెళ్లాలని, పరీక్షలకు సంబంధంలేని వ్యక్తులెవరిని కూడా పరీక్ష హాలులోకి అనుమతించరాదని, మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వరాదని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఫర్నిచర్, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్లు, ఫ్యాన్లు అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఈవో రేణుకాదేవి, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.