
మట్టిని నమ్ముకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. అందుకోసం కొన్నేండ్లుగా రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. ఇప్పటికే 1,29,615 మంది రైతులకు సంబంధించిన బీమా ప్రీమియాన్ని చెల్లించిన ప్రభుత్వం మరింత మందికి ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. అందులో భాగంగా కొత్తగా పట్టాదారు అన్నదాతలకు ఈ నెల 30లోపు రైతుబీమాకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. గడువు మూడు రోజులు మాత్రమే ఉన్నదని, అర్హులైన రైతుంలందరూ దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు కోరుతున్నారు. కాగా జిల్లాలో మూడేండ్లలో 2,424 మంది రైతు కుటుంబాలకు రైతుబీమాతో ప్రయోజనం కలిగింది. బాధిత రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.121.20 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని అందించి అండగా నిలిచింది.
వికారాబాద్, ఆగస్టు 27, (నమస్తే తెలంగాణ) : మట్టిని నమ్ముకుని ఆరుగాలం కష్టపడే అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. 2017 నుంచి రైతు బీమా పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా ఈ వానకాలంలో జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5,88,475 ఎకరాలు కాగా, 5,00,483 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తుండగా.. 1,29,615 మంది రైతులకు ప్రభుత్వం రైతు బీమా కోసం ప్రీమియం చెల్లించింది. 18 నుంచి 59 ఏండ్ల మధ్య వయసున్నవారికి బీమా వర్తిస్తుంది. రైతు బీమా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు అవకాశం కల్పించారు. మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని కొత్త పట్టాదారు రైతులకు ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చింది.
ప్రభుత్వం అన్నదాతల కుటుంబాలను ఆదుకోవడం కోసం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులెవరైనా చనిపోతే నామినీకి రూ.5లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు. బీమా పొందిన రైతు ఎలా చనిపోయినా ఆ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం నేరుగా అందుతుంది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా గత మూడేండ్లలో 2424 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందారు. వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.121.20 కోట్ల ఆర్థిక సాయం అందించింది. రైతు కుటుంబాలకు రైతు బీమా ఆర్థికంగా ధీమానిస్తున్నది. వాస్తవంగా ప్రభుత్వం పూర్తి ప్రీమియం చెల్లించి రైతులకు బీమా కల్పించడం ఎంతో ప్రయోజనంగా ఉందని రైతులు చెబుతున్నారు.
వ్యవసాయ భూమి ఉన్నట్లుగా ఆగస్టు 3లోగా డిజిటల్ సంతకం అయి ధరణి ఆన్లైన్లో నమోదైన రైతులు రైతు బీమా పథకంలో చేరేందుకు అర్హులు. రైతులు ఆధార్‌కార్డు సమర్పించాల్సి ఉంటుంది. నామినీ ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే రైతుకు 18 ఏండ్ల నుంచి (14 ఆగస్టు 2003 కన్నా ముందు జన్మించి ఉండాలి) 59 ఏండ్ల లోపు రైతులు (14 ఆగస్టు 1962 తర్వాత జన్మించినవారు) అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్‌కార్డులోని డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా తేదీని పరిగణనలోకి తీసుకుని అర్హులుగా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇప్పుడు బీమా చేసుకోకపోతే ఇంకో సంవత్సరం వరకు చేసుకోవడానికి వీలుండదు. రైతు బీమాకు ఇంతవరకు దరఖాస్తు చేయనివారు.. కొత్తగా పట్టా పొందినవారు ఆగస్టు 30లోపు తమ వివరాలను స్థానిక వ్యవసాయాధికారికి సమర్పించినట్లయితే
వారు ప్రాసెస్‌ను కొనసాగిస్తారు.
రైతు బీమాకు మరో మూడు రోజులే గడువు ఉంది. అర్హులైన రైతులు వెంటనే మండల వ్యవసాయ అధికారిని కలిసి వివరాలు ఇవ్వాలి. ఆగస్టు 3లోగా డిజిటల్ సంతకాలు అయిన రైతులు మాత్రమే దీనికి అర్హులు. సమగ్ర వివరాలు ఏఈవోలకు అందించాలి. జిల్లావ్యాప్తంగా మూడేండ్లలో 2,424 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా.. వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.121.20 కోట్లు ఆర్థిక సాయం అందించడమైనది.
రైతు సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బీమా పథకం కుటుంబానికి ఎంతో ఆసరా కల్పిస్తున్నది. మా అమ్మ కమరున్నిసాబేగం మృతిచెందగా ప్రభుత్వం రూ.5లక్షల రైతు బీమా మంజూరు చేసింది. దాంతో
ట్రాక్టర్ అప్పు తీర్చుకున్నాం.
నా భర్త చెరువులో పడి చనిపోతే బీమా ద్వారా వారం రోజుల్లో రూ.5లక్షల సహాయం అందింది. ఈ సహాయం మా కుటుంబాన్ని ఎంతోగానో ఆదుకుంది. చేసిన అప్పులు తీర్చుకున్నాం. కేసీఆర్ దేవుడిగా మారి ఆదుకుంటుండు. ఇలాంటి సహాయం ఇచ్చినట్లు ఎప్పుడూ చూడలేదు.
మా నాన్న పట్లోళ్ల బల్వంత్‌రెడ్డి. మాకు 4 ఎకరాల భూమి ఉంది. మా నాన్న చనిపోవడంతో రూ.5లక్షల రైతు బీమా డబ్బులు ప్రభుత్వం అందజేసింది. ఈ డబ్బులతో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడి సమీపంలో వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాం. వాటర్ ప్లాంట్‌లో పనులు చేసుకుంటూ పొలం పనులు చేసి జీవనం సాగిస్తున్నాం. రూ.7వేలు ఇచ్చి మరొకరికి ఉపాధి కల్పించాను.
సంవత్సరం రైతులు రూ.కోట్లలో
2018-19 769 38.45
2019-20 791 39.55
2020-21 864 43.20