పూడూరు, సెప్టెంబర్7: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో చీలాపూర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. గ్రామల్లో సీసీ రోడ్డు, మురుగు కాల్వలు, చెత్త సేకరణకు ట్రాక్టర్, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, వర్మీ కంపోస్ట్ షెడ్డు, ప్రకృతి వనం, నర్సరీ, వీధుల్లో ఎల్ఈడీ బల్బుల వెలుగులు వంటి మౌలిక వసతులు కల్పించడంతో గ్రామం చూడచక్కగా కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా నిధులు అందజేయడంతో సర్పంచ్ కె.రాములు అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. హరితహారంతో గ్రామానికి వచ్చే రోడ్డు, పాఠశాల, పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు పచ్చని అందాలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పాడుబడ్డ బావులు, శిథిలావస్థలో ఉన్న ఇండ్లు తొలిగించడంతో పరిసరాలు పరిశుభ్రంగా మారాయి. హైదరాబాద్- బీజాపూర్ హైవే రోడ్డు నుంచి చీలాపూర్ గ్రామం వరకు ఇరుపక్కలా పిచ్చి మొక్కలు తొలగించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నారు. మిషన్ భగీరథలో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మించి తాగునీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. పూడూరు మండలంలోని చీలాపూర్ పంచాయతీలో 1650 మంది జనాభా ఉన్నారు.
గ్రామంలో పలు అభివృద్ధి పనులు
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చీలాపూర్ పంచాయతీలోని ప్రభుత్వ స్థలంలో రూ.12.50 లక్షలతో వైకుంఠధామం, రూ.1.70 లక్షలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేశారు. ఇందులో రకరకాల పూల మొక్కలు నాటారు. తులసి, అశోక, జామ, మామిడి, టేకు వంటి మొక్కలు నాటారు. రూ.6లక్షలతో సీసీ రోడ్డు, మురుగు కాల్వలు నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా 120 మీటర్ల పైపులైన్ వేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వీధుల్లో బురద కాకుండా గ్రావలింగ్ రోడ్డు నిర్మించారు. రూ.9.52లక్షలతో ట్రాక్టర్ను కొనుగోలు చేసి, ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. హరితహారం ద్వారా పాఠశాలలో, రోడ్డు ఇరువైపులా, పల్లె ప్రకృతి వనంలో మొత్తం 2500ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.
అందరి సహకారంతో అభివృద్ధి
పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పలు వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించాం. పల్లె ప్రగతి ద్వారా పంచాయతీలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, కంపోస్టు షెడ్డు, పార్కు పనులు పూర్తి చేశాం. హరితహారంలో 2500 మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. పల్లె ప్రగతితో గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. – గుట్టకుర్వ రాములు, సర్పంచ్, చీలాపూర్
ప్రభుత్వ నిధులతో పనులు చేయిస్తున్నాం
ప్రతి నెలా పంచాయతీకి ప్రభుత్వం నుంచి నిధులు రావడంతో పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. గ్రామస్తుల సహకారంతో సర్పం చ్ రాములు, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నాం. పంచాయతీలో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలోని అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నాం.