ఫోర్త్‌సిటీ రోడ్డు నిర్మాణ బాధితులు ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. దశలవారీగా ఆందోళనలను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. తాము తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ జీవిస్తున్న
భూ ములను ప్రభుత్వం ఫోర్త్‌సిటీ రహదారి నిర్మాణానికి తీసుకుంటే రోడ్డున పడుతా మని కొంగరకలాన్, రావిర్యాల, పంజాగూడ, అగర్మియాగూడ, లేమూర్, మీర్ఖాన్పేట, తుర్కగూడ తదితర గ్రామాలకు చెందిన బాధిత రైతులు ఆదివారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో జరుగనున్న ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తమ గోడును వినిపించా లని నిర్ణయించుకున్నారు.
– రంగారెడ్డి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ)
పోలీసుల నిర్బంధంలో సర్వే
ఫోర్త్‌సిటీ సర్వే పనులను రైతులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తమ భూ ముల్లో ఎలాంటి సర్వేలు చేపట్టొద్దని అధికారులను హెచ్చరిస్తున్నారు. అయినా అధికారులు పోలీసుల నిర్బంధంలో సర్వేను చేపడుతున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ భూముల్లో సర్వే చేయడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారులు తమ వినతులను పట్టించుకోకపోవడంతో బాధితులంతా సంఘటితమై ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఫ్యూచర్‌సిటీ ఏర్పాటుతో ఎగ్జిట్ నం-13 నుంచి కొంగరకలాన్, రావిర్యాల, పంజాగూడ గ్రామాల్లో భూముల ధరలు ఎకరానికి రూ. కోట్లలో పలుకుతున్నాయి. రూ. కోట్లు పలికే భూముల నుంచి మూడు వందల మీటర్ల రోడ్డు ఏర్పా టు చేస్తే.. ఈ మూడు గ్రామాల్లోని సుమారు రెండు వందల మంది రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కొంగరకలాన్ కలెక్టరేట్ నుంచి పంజాగూడ వరకు రోడ్డుకిరువైపులా సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉన్నారు. వారికి ఎకరం, రెండెకరాల భూములు మాత్రమే ఉన్నాయి. తమ భూముల నుంచి రోడ్డు ఏర్పాటైతే.. తమకు ఉపాధి ఉండదని.. ప్రభుత్వం స్పందించి రెండు వందల మీటర్ల వరకు రోడ్డును నిర్మిస్తే బాగుంటుందని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
దశల వారీగా ఆందోళనలు..
ఫ్యూచర్‌సిటీ రోడ్డు బాధితులు దశలవారీగా ఆందోళనలను తీవ్ర తరం చేయాలని నిర్ణయించారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎంకు కూడా అర్జీని అందించాలని తమ గోడు చెప్పుకోవాలని భావిస్తున్నారు. సమాచారం ఇవ్వకుండా తమ భూములు సర్వే చేయడమే కాకుండా అడిగేందుకు వెళ్తే అడ్డుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.
బాధిత రైతులకు అండగా ఉంటాం..
ఫ్యూచర్‌సిటీ రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోనున్న బాధితులకు న్యాయం జరి గే వరకు అండగా ఉంటాం. రోడ్డు ఏర్పాటుతో ఎంతోమంది సన్న, చిన్నకారు రైతు లు భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం సమంజసం కాదు. రైతులకు తెలియకుండా, వారికి సమాచారం లేకుండా వారి భూముల్లో సర్వే చేయొద్దు.