యాచారం, జూన్12: హైదరాబాద్ శివారు యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బుధవారం అర్ధరాత్రి 90 ఏళ్ల వృద్ధురాలిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.
సీఐ నందీశ్వర్ రెడ్డి కథనం ప్రకారం.. యాచారం మండల పరిధిలోని మంతన్ గౌరెల్లి గ్రామంలో 90 ఏళ్ల ఓ వృద్ధురాలు బుధవారం అర్ధరాత్రి తన ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో కొంతమంది దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. మద్యం మత్తులో ఆమెపై దాడికి ఒడిగట్టారు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం తెల్లవారుజామున చుట్టుపక్కల వారు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆరా తీశారు. అనంతరం వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను గ్రామస్తులు కోరారు.