రంగారెడ్డి, జూలై 18 (నమస్తే తెలంగాణ) : రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఎల్ఓలు సమర్థవంతమైన స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ ను తయారు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫొటో ఎలక్టోరల్ రోల్స్ 2వ ఎస్ఎస్ఆర్ 2023పై బూత్ స్థాయి అధికారుల శిక్షణా కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ పారదర్శకమైన ఎన్నికల జాబితా తయారు చేయాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల జాబితాను నిర్ధారించాలని, గరుడ (బీఎల్వో) యాప్‌లో వివరాల నమోదు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. పోలింగ్ స్టేషన్లను సందర్శించి అన్ని సౌకర్యాలు ఉన్నాయా చూసుకోవాలని, ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరమైతే సమకూర్చాలన్నారు. పొలిటికల్ పార్టీ కార్యాలయాలకు 2కి.మి. దూరం, ఓటర్లకు సమీపంగా పోలింగ్ కేంద్రాలు ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. చనిపోయిన ఓటర్ల విషయంలో కచ్చితంగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొంది, కుటుంబ సభ్యుల ద్వారా వాకబు చేసిన తరువాతే ఓటరు జాబితా నుంచి వివరాలను తొలగించాలన్నారు. అనాథలు, ఒంటరి, కూలీ కోసం ఊరూరు తిరిగే వారి వివరాలను కూడా సేకరించి వారి స్థిర చిరునామా ఆధారంగా ఓటరుగా నమోదు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధుల కోసం ర్యాంపులతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కచ్చితంగా కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి
వికారాబాద్ : ఎలక్షన్ లాగిన్‌లో మంగళవారం వరకు వచ్చిన ప్రతి దరఖాస్తు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకొని ధ్రువీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటరు జాబితా రూపకల్పనపై ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 8500 దరఖాస్తులను పరిశీలించి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. పొరపాటున తొలగించిన ఓటరు జాబితాను మరో సారి ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించాలని పేర్కొన్నారు. ఓటరు జాబితాకు సంబంధించిన అన్ని త్వరగా పూర్తి చేసి నివేదికను పూర్తి చేయాలని సూచించారు. ధరణి వెబ్సైట్లో వంద శాతం ఆప్షన్లు వచ్చాయని, ధరణి సమస్యలన్నీ పరిష్కరించేందుకు ప్రతి మండలం నుంచి కనీసం 30 దరఖాస్తులను కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని తహసీల్దార్లకు సూచించారు. వారం రోజుల్లో ప్రాధాన్యత క్రమంగా ధరణి సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు పంపించాలని అలాగే అసైన్ భూములు, ఇనాం భూముల పరిష్కారానికి జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో రిటర్నింగ్ అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు ఎలెక్షన్ అధికారులు ఉన్నారు.
ఈనెల 20నుంచి ఈవీఎంలపై అవగాహన
ఇబ్రహీంపట్నం : అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 20నుంచి 90రోజులపాటు ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగంపై గ్రామాల్లో ప్రజలకు మొబైల్ వాహనం ద్వారా అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. రాజేంద్రనగర్‌లో గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో జూన్ 12 నుంచి జూలై 1వ తేదీ వరకు ఎఫ్ఎల్సీ నిర్వహించిన ఈవీఎంల గోడౌన్లపై విషయం తెలుపటం జరిగింది. ఇబ్రహీంపట్నం మినహా, మహేశ్వరం, చేవెళ్ల, ఎల్బీనగర్, షాద్‌నగర్, కల్వకుర్తి, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఈవీఎంలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, వివిధ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.