మొదటి విడుతలో 60మంది టీచర్లకు శిక్షణ
వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కార్ బడుల్లో ఆంగ్ల మాధ్యమం
1-8వ తరగతి వరకు అందుబాటులోకి..
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
వికారాబాద్ జిల్లాలో 77,137 మంది విద్యార్థులు
పరిగి, మార్చి 14 : ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-8 తరగతుల విద్యార్థులకు, దశలవారీగా అన్ని క్లాస్‌లకు ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో సోమవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ విధానంలో మంత్రి సబితారెడ్డి ఈ శిక్షణను ప్రారంభించారు. మొదటి విడుతలో 60 మంది టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన రిసోర్స్పర్సన్లతో ఉపాధ్యాయులకు మెళకువలు నేర్పుతున్నారు. మొదటి విడుతలో ఎస్జీటీ స్థాయిలోని ఉపాధ్యాయులకు ఆన్లైన్ వేదికగా శిక్షణ ఇస్తున్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా సర్కారు బడుల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు 77,137 మంది విద్యార్థులు ఉన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టనుండగా.. ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది. అంతేకాకుండా మన ఊరు-మన బడిలో భాగంగా ప్రతి పాఠశాలలో 12 అంశాలలో సదుపాయాలు కల్చించనున్నది. దశలవారీగా మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పూర్తిస్థాయిలో వసతులు ఏర్పాటు చేయనున్నది. నేడు ఏ పోటీ పరీక్షలు రాసినా.. ఉద్యోగం చేయాలన్నా ఆంగ్లంలో నైపుణ్యం ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ సర్కారు బడుల్లోనూ ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ప్రభుత్వం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించింది.
జిల్లాలో 77137 మంది విద్యార్థులు..
వికారాబాద్ జిల్లా పరిధిలో 767 ప్రాథమిక పాఠశాలల్లో 43,923 మంది, 116 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 12,136 మంది, 175 ఉన్నత పాఠశాలల్లో 37,130 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా సర్కారు బడుల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు 77,137 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో బాలికలు 37586 మంది, బాలురు 39551 మంది ఉన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో 9వ తరగతి వారికి, 2024-25లో 10వ తరగతి వారికి ఆంగ్లంలో విద్యాబోధన అందనున్నది.
ఉపాధ్యాయులకు శిక్షణ..
ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ప్రభుత్వం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభించింది. విడుతలవారీగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నది. జిల్లాకు సంబంధించి డైట్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి మొదటి విడుతలో భాగంగా 60 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన రిసోర్స్పర్సన్లు ఉపాధ్యాయులకు మెళకువలు నేర్పుతున్నారు. మొదటి విడుతలో ఎస్జీటీ స్థాయిలోని ఉపాధ్యాయులకు ఆన్లైన్ వేదికగా శిక్షణ ఇస్తున్నారు. ఐదు రోజులపాటు ఈ తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణ అనంతరం వారికి వర్క్షీట్లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఆయా మండలాల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే టీచర్ల శిక్షణ పూర్తి కానున్నది.
ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన..
ఆంగ్ల మాధ్యమంతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాబోధన అందనున్నది. గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనతో సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నారు. కరోనా తర్వాత సర్కారు బడుల్లో విద్యార్థుల చేరిక బాగా పెరిగింది. చాలామంది విద్యార్థులు ప్రైవేటు బడులు వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధనతోపాటు ప్రతి పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించనుండడంతో ఈ చేరికలు గణనీయంగా పెరుగనున్నాయి.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ;రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
ఆంగ్ల మాధ్యమంలో బోధనకై ఉపాధ్యాయులకు ఏర్పాటుచేసిన శిక్షణా తరగతులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి కోరారు. సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ దేవసేన, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి మంత్రి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే దిశగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.7,413 కోట్ల వ్యయంతో ‘మన ఊరు-మన బడి’ చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని సీఎం ఆదేశించారన్నారు. శిక్షణా తరగతులకు హాజరై ఉపాధ్యాయులు తమ నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ కలెక్టర్ నిఖిల, డీఈవోలు సుశీందర్‌రావు, రేణుకాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చేవెళ్ల నుంచి పాల్గొన్న రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని 1,347 ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్‌లో బోధన కోసం 17 కేంద్రాల్లో 60 రిసోర్స్ పర్సన్స్‌తో శిక్షణ ఇస్తున్నామని మంత్రికి తెలిపారు
విద్యార్థులకు మేలు జరుగుతుంది..
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టడం మంచి నిర్ణయం. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కూడా పెరుగుతుంది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య లభిస్తున్నది. చాలామంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లను వదిలి గవర్నమెంట్ స్కూళ్లలో చేరడం ఖాయం.
-మంజుల, మాజీ జడ్పీటీసీ, మందిపల్, కులకచర్ల
విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన అందుబాటులోకి తేవడం శుభపరిణామం. దీంతో ప్రభుత్వ బడికి తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతారు. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయం పేద పిల్లలకు వరం.
–బుడ్డమ్మ, మక్తవెంకటాపూర్, కులకచర్ల