‘దివ్యాంగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తున్నది.. సమస్యలు పరిష్కరించకపోగా, వారం రోజులుగా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడు.. ఎన్నికలకు ముందు పింఛన్లు పెంచుతమని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక కన్నెత్తి చూస్తలేదు.. రూ.4016 పింఛన్‌ను రూ.6వేలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్.. నోరెందుకు మెదపడం లేదు.. చెప్పిన మాటలు నీటిమూటలేనా.. నమ్మి ఓట్లేస్తే మొండి చేయి చూపుతరా.. మాకు దిక్కెవరూ..’ అని రంగారెడ్డి జిల్లాలోని దివ్యాంగులు కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడుతున్నారు. నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు.
– రంగారెడ్డి, డిసెంబర్ 2 (నమస్తేతెలంగాణ)
జిల్లాలో 35వేల మంది దివ్యాంగులు..
రంగారెడ్డి జిల్లాలో 35,500 మంది దివ్యాంగులు ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా ఠంచన్‌గా పింఛన్లు వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నదని జిల్లాలోని దివ్యాంగులు వాపోతున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లను మాత్రమే గత రెండురోజుల కింద విడుదల చేశారని, అదికూడా మున్సిపాలిటీల్లో నేటికీ విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ నెల పింఛన్లు నేటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని వారు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.6వేల పింఛన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆందోళన బాట పట్టాల్సి వస్తున్నదని, స్పందించకపోతే నిరసనలను తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
పింఛన్లు పెంచే వరకు ఆందోళన కొనసాగిస్తాం..
దివ్యాంగుల పింఛన్ రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నది. దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకున్నది. అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించిన పింఛన్లు కూడా ఇంకా అందలేదు. పింఛన్లు పెంచేవరకు ఆందోళన కొనసాగిస్తాం.
– ఆకుల సంజీవ, దివ్యాంగుడు
అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసనలు
– కాళ్ల జంగయ్య, దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
పింఛన్లు పెంచాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని, నేడు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసనలు చేయాలని పిలుపునిచ్చినట్లు దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరుగనున్న దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో కూడా తాము నిరసన వ్యక్తం చేస్తామని పేర్కొన్నారు.
నేడు కేసీఆర్‌ను కలువనున్న దివ్యాంగులు..
దివ్యాంగుల పింఛన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నందున మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలువనున్నట్లు కాళ్ల జంగయ్య తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదని, భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలకు మద్దతు తెలుపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కోరనున్నట్లు ఆయన వివరించారు.
షాద్‌నగర్‌లో రిలే నిరాహార దీక్ష
షాద్‌నగర్‌టౌన్, డిసెంబర్ 2: ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుల పింఛన్‌ను పెంచాలని దివ్యాంగుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు భుజంగరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం షాద్‌నగర్‌లోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. పింఛన్ల పెంపు విషయంలో రాష్ట్ర సర్కార్ కాలయాపన చేస్తున్నదని వివర్శించారు. కేంద్ర ప్రభుత్వం 2011 నుంచి దివ్యాంగులకు కేవలం రూ.300 ఇస్తున్నదని, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా రూ. 3వేలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న రూ.6వేల పింఛన్‌ను త్వరగా అమలు చేయాలని, ఉచిత బస్సు సౌకర్యం, ఆర్థిక రుణాలు, ఉప పరికరాలు, డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రైవేలు సంస్థల్లో 5శాతం ఉద్యోగాలు దివ్యాంగులకు కేటాయించాలని కోరారు. అనంతరం ఆర్డీవో సరితకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల జాతీయ వేదిక నాయకులు రాజు, శేఖర్, కృష్ణయ్య, రమేశ్, సుగణయ్య, బేబీకాజు, షహీన్, ఓసియాబేగం, సంతోష, కుస్మా, మనీల, మల్లేశ్, శ్రీనాథ్, మసూద్, అంజయ్య, కిష్టయ్య, గఫర్, యాదయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.