బ్యాలెట్ ఓట్లువికారాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలో చాలా మంది ఓటర్లు నోటాకు మొగ్గు చూపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని చేవెళ్ల, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లు చాలా వరకు నోటాకు ఓటేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్లు కొంతమేర తగ్గింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నోటాకు 9220 ఓట్లు మాత్రమే రాగా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 6308 ఓట్లు నోటాకు పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో 2912 ఓట్లు తక్కువగా పోలయ్యాయి. అయితే ఏదేని నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటాకు ఓటేసే అవకాశాన్ని ఓటర్లకు ఎన్నికల సంఘం కల్పించడంతో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నోటాకు ఓటర్లు ఓటేశారు. ఓట్ల లెక్కింపులో భాగంగా ప్రతి రౌండ్లో నోటాకు వచ్చిన ఓట్లు పెరిగాయి. ప్రతి రౌండ్లో స్వతంత్ర అభ్యర్థులకు మించి నోటాకు ఓట్లు రావడం గమనార్హం. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగో స్థానంలో నోటా నిలువడం గమనార్హం. మరోవైపు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరిట మరొకరు పోటీలో ఉన్న అభ్యర్థికి 3 వేలకుపైగా ఓట్లు పోలుకాగా, నోటా తర్వాత స్థానంలో నిలిచారు. ఏ మాత్రం తేడా లేకుండా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరిట మరొక అభ్యర్థి బ్యాలెట్ యూనిట్లో 4వ స్థానంలో ఉండగా కొంత మంది ఓటర్లు అయోమయంలో 4వ స్థానంలో ఉన్న అభ్యర్థికి ఓటేయడంతో ఐదో స్థానంలో నిలిచారు.
పోస్టల్ బ్యాలెట్‌లోనూ బీజేపీకే ఆధిక్యం..
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ బీజేపీ అధిక్యత సాధించింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 19,397 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలుకాగా, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి 11,365 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డికి 6124 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు 1428 ఓట్లు పోలయ్యాయి. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరిట పోటీలో ఉన్న మరొక అభ్యర్థికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ 12 ఓట్లు రావడం గమనార్హం.
మూడు బ్యాలెట్ యూనిట్లతో ఓటర్లు కన్ఫ్యూజన్..
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లను వినియోగించారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బరిలో 43 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో మూడు బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మూడు బ్యాలెట్ యూనిట్లతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు కొంతమేర నష్టం జరిగింది. మూడు బ్యాలెట్ యూనిట్లు ఉండడంతో కొంత మంది ఓటర్లు అయోమయానికి గురైనట్లు పోలైన ఓట్లను పరిశీలిస్తే తెలుస్తున్నది. ఆయా పార్టీల అభ్యర్థులు బ్యాలెట్ యూనిట్లో మొదటి స్థానం, రెండో స్థానం, మూడో స్థానంలో తమకు ఓటేసి గెలిపించాలని ప్రచారంలో భాగంగా ఓటర్లను కోరారు. ఇంతవరకు బాగానే ఉన్న పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్లు ఉండడంతో కొందరు ఓటర్లు అయోమయంతో రెండో బ్యాలెట్ యూనిట్లలోని మొదటి మూడు స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు, మరికొందరు మూడో బ్యాలెట్ యూనిట్‌లోని మొదటి మూడు స్థానాల్లోని అభ్యర్థులకు ఓటేసినట్లు పోలైన ఓట్లను చూస్తే స్పష్టంగా అర్థమవుతున్నది. రెండు, మూడు బ్యాలెట్ యూనిట్లలోని మొదటి మూడు స్థానాల్లో అభ్యర్థులకు ప్రతి రౌండ్లోనూ 300-400 ఓట్లు పోల్ కావడం గమనార్హం.