Vikarabad | వికారాబాద్, మే 31 : పొగతాగడం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని, ధూమపానం మానేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని సీనియర్ సివిల్ జడ్జ్, డీఎల్ఎస్ఏ సెక్రటరీ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని మెడికల్ కాలేజి కన్స్ట్రక్షన్ సైట్లో పని చేస్తున్న కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జ్, డీఎల్ఎస్ఏ సెక్రటరీ ఎం.వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పొగతాగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందన్నారు.
ధూమపానం మానేసిన కొద్ది రోజుల్లోనే గుండె పనితీరు మెరుగుపడుతుందని, రక్తపోటు తగ్గి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారతాయని వైద్యులు చెబుతున్నారన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 1987 నుండి ప్రతి సంవత్సరం మే 31 న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తుందన్నారు. పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య లక్ష్య మని తెలిపారు. ధూమపానం మానేయడానికి వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలను పాటించాలని సూచించారు. అనంతరం కార్మికులందరితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన అంకిత సంస్థ ప్రతినిథులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో అంకిత స్వచ్ఛంద సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అడ్వకేట్లు వెంకటేష్, రాములు, అడ్వకేట్ రాజశేఖర్, అంకిత సంస్థ ప్రతినిథులు ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్, మండల కో ఆర్డినేటర్ సంజీవ్ రావు, సైట్ ఇంచార్జి గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.