రంగారెడ్డి, జనవరి 30(నమస్తే తెలంగాణ): మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగానూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప కాలిక వడ్డీతో కూ డిన రుణాలను మంజూరు చేస్తున్నారు.
వాటితో స్వయం సహాయక సంఘాల సభ్యులు (ఎస్ హెచ్‌జీలు) కిరాణా షాపులు, వ్యవసాయం దాని అనుబంధ రంగాలు, పిండిగిర్నీలు, టైలరింగ్, బ్యూటీపార్లర్లు, ఫుట్‌వేర్ తదితర వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాదిలో బ్యాంకు లింకేజీ ద్వారా రూ.710 కోట్ల రుణాలను ఎస్‌హెచ్‌జీలకు పంపిణీ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు రూ.678 కోట్ల (95.5 శాతం) రుణాలను..
అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో రూ.463 కోట్లకుగాను రూ. 405కోట్ల (87.46 శాతం) రుణాలను మంజూరు చేశారు. రంగారెడ్డి జిల్లాలో జనవరి నాటికి 95.5 శాతం రుణ లక్ష్యా న్ని చేరుకోగా.. ఫిబ్రవరి 10తేదీ వరకు వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేస్తామని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా వికారాబాద్ జిల్లాలో ఫిబ్రవరి నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా రుణాలను మంజూరు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
జిల్లాలో గతేడాది రూ.450 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని లక్ష్యానికి మించి రూ.499 కోట్ల రుణాలను బ్యాంకర్లు స్వయం సహాయక సంఘాలకు అందించారు. జిల్లాలో 657 గ్రామసంఘాలు, 10,375 స్వయం సహాయక సంఘాలుండగా అందులో 1.80 లక్షల మంది సభ్యులున్నారు. రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 12,989 స్వయం సహాయక సం ఘాలున్నాయి.
రుణాల మంజూరులో జిల్లా రాష్ట్రంలో నాల్గో స్థానంలో ఉండగా.. రుణాల రికవరీలోనూ 1.06 ఎన్పీఏతో తెలంగాణలో 5వ స్థానంలో ఉన్నది. రుణాలను సకాలంలో చెల్లించే స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అధిక ప్రాధాన్యమి స్తున్నారు. ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు ఇస్తున్నారు. సంఘాల పనితీరును బట్టి సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.20లక్షల వరకు మంజూరు చేస్తున్నారు.
రూ.405 కోట్ల రుణాలు మంజూరు..
వికారాబాద్ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.463 కోట్ల లక్ష్యానికిగానూ ఇప్పటివరకు రూ. 405 కోట్ల్ల (87.46%) రుణాలను ఎస్‌హెచ్‌జీలకు అందించారు. అత్యధికంగా బంట్వారం మండలంలో లక్ష్యానికి మించి 113% మేర రుణాలను మంజూరు చేయగా, మోమిన్‌పేట మండలంలో (33.39కోట్లు) 106%, కోట్‌పల్లి మండలంలో 105%, యాలాల మండలంలో (రూ.24.57 కోట్లు) 101%, పూడూరు మండలంలో 100.48%, కొడంగల్ మండలంలో 93.05%, నవాబుపేట
మండలంలో(23.04 కోట్లు)92.92%, మర్పల్లి మండలంలో 89.44%, చౌడాపూర్ మండలంలో 88.81%, కులకచర్ల మండలంలో (22.85కోట్లు)85.56%, బషీరాబాద్ మం డలంలో (రూ.24.84 కోట్లు)85.40%, దోమ మండలంలో (రూ.24.05 కోట్లు) 85.29%, పెద్దేముల్ మండలంలో 83.56%, పరిగి మండలంలో (20.75కోట్లు) 83.56%, ధారూరు మండలంలో 83.22%, వికారాబాద్ మండలంలో 82.46%, బొంరాస్‌పేట మండలంలో (19.29 కోట్ల)74% మేర బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలలు గడువున్న దృష్ట్యా అన్ని మండలాల్లోనూ లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేసేందుకు డీఆర్డీఏ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు.
అదేవిధం గా ఎన్పీఏ(పనిచేయని సంఘాలు)లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రుణాలు తిరిగి చెల్లించడంలో మొండికేసిన సంఘాలకు రుణాలను నిలిపివేశారు. విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మూడు వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారులుగా మారారు. వారు వ్యాపారాలను నిర్వహించుకునేందుకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామసంఘం నిధుల ద్వారా సుమారు రూ.30 కోట్ల రుణాల వరకు అందజేశారు. ఇందులో ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణాలను మంజూరు చేశారు.
ఫిబ్రవరిలోనే లక్ష్యాన్ని అధిగమిస్తాం
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యం పెరిగింది. ఏటా లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. ఈ ఏడాది ఫిబ్రవరి 10 నాటికే లక్ష్యాన్ని అధిగమిస్తాం. కలెక్టర్ ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా మండలాల వారీగా సమీక్షలు నిర్వహించి అర్హులకు రుణాలు అందించి వారి ఆర్థిక పురోభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.
– జంగారెడ్డి, ఏపీడీ, రంగారెడ్డి జిల్లా