రైతులకు తక్కువ ధరకే అద్దె పనిముట్లు, యంత్రాలు
రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో మెరుగైన ఫలితాలు
పనిముట్ల కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తున్న రాష్ట్ర సర్కార్
వికారాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో కొనసాగుతున్న సంఘాలు
మున్ముందు మరిన్ని మండలాల్లో ఏర్పాటుకు సర్కారు చర్యలు
తాండూరు రూరల్, ఫిబ్రవరి 20: అదునుకు సాగు చేస్తేనే అనుకున్న పంట దిగుబడి చేతికొస్తుంది.. లేదంటే ఆరుగాలం పడ్డ కష్టం ఆవిరవుతుంది.. వ్యవసాయానికి దున్నకం మొదలు పంట నూర్పిడి వరకు కూలీలతో పాటు పనిముట్లు, యంత్రాల అవసరం ఎంతోగానో ఉంటుంది. రైతులకు ఆర్థిక భారం తగ్గించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు నిధులను మంజూరు చేసి వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేయించింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు, మోమిన్‌పేట, బొంరాస్‌పేట మండలాల్లో (ఎఫ్పీసీ), కులకచర్ల (ఎఫ్‌పీవో)లో వ్యవసాయ పనిముట్లు అద్దెకు ఇవ్వడం కొనసాగుతుండగా సత్ఫలితాలు వస్తున్నాయి. బయటి మార్కెట్ కిరాయి కంటే తక్కువకే పనిముట్లను ఇస్తుండడంతో అన్నదాతలకు ఎంతో మేలు చేకూరుతున్నది. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో మున్ముందు జిల్లాలోని మరిన్ని మండలాల్లో అద్దె పనిముట్లను సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
అదునుకు సాగు చేస్తేనే అనుకున్న పంట దిగుబడి చేతికొస్తుంది. అందువల్ల రైతుల వ్యవసాయ పనులు సకాలంలో పూర్తి కావడానికి.. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుని వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభు త్వం ప్రారంభించిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (టీఎస్ఎస్ఈఆర్పీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు ఉత్పత్తిదారుల కంపెనీ (ఎఫ్పీసీ), వ్యవసా య ఉత్పత్తిదారుల ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో) లు మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. జిల్లాలోని తాండూరు, మోమిన్‌పేట, బొంరాస్‌పేట (ఎఫ్పీసీ), కులకచర్ల (ఎఫ్‌పీవో) మండలాల్లో ఈ సంఘాలు కొనసాగుతున్నాయి. కులకచర్లలో 2018 నవంబర్‌లో రామలింగేశ్వర చిరుధాన్యాల లిమిటెడ్(ఎఫ్‌పీవో)ను ప్రారంభించారు. అదేవిధం గా 2019 డిసెంబర్ నెలలో మెమిన్పేటలో అనంతగిరి (ఎఫ్పీసీ) లిమిటెడ్‌ను, తాండూరులో జూన్ 2021లో తాండూరు మహిళా(ఎఫ్పీసీ) లిమిటెడ్‌ను, బొంరాస్‌పేట్‌లో జూన్ 2021లో బొంరాస్‌పేట మహిళా (ఎఫ్పీసీ)లిమిటెడ్‌ను ప్రారంభించా రు. 1935 చట్ట ప్రకారం ఈ సంఘాలను రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ ఉత్పత్తిదారుల సంఘాల్లో 304 మంది (ఎఫ్పీసీ) సభ్యులుగా ఉన్నారు. రెం డు, మూడు గ్రామాలకు కలిపి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఎన్నుకుంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. అందు లో చైర్మన్, వైస్ చైర్మన్లు కూడా ఉంటారు. వీరు ప్రతినెలా సమావేశాలను నిర్వహించి ఆదాయ, వ్యయాలపై చర్చించడంతోపాటు ఉత్పత్తిదారుల సంఘాల అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై కుణ్ణంగా చర్చిస్తారు. ఆయా సంఘాల్లో కలిపి మొత్తం 4,658 మంది సభ్యులు కొనసాగుతుండగా రూ. 23,29,000 నగదు వారి బ్యాంకు అకౌంట్లలో జమ అయ్యింది. దీనికి తగ్గట్లుగానే ప్రభుత్వం గ్రాంట్స్ రూపంలో వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు నిధులను మంజూరు చేసింది. మోమిన్‌పేటకు సీడ్ ఫండ్ కింద రూ.50 లక్షలు మంజూరు కాగా, కులకచర్లకు రూ.58.74 లక్షలు, తాండూరుకు రూ.33 లక్షలు, బొంరాస్‌పేటకు రూ. 3 లక్షలను మంజూరు చేసింది.
తక్కువ ధరకే యంత్ర పరికరాలు
గ్రామాల్లోని రైతులు, వ్యవసాయ కూలీలకు అన్ని పనులు సకాలంలో పూర్తి అయితేనే దిగుబడి మంచి గా వస్తుంది. పెట్టుబడి ఖర్చులను తగ్గించి, రైతులకు కొంత ఆదాయం మిగిలేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా వ్యవసాయ యంత్రాలతోపాటు పనిముట్లను (హార్వెస్టర్లు, ట్రాలీతో కూడిన ట్రాక్టర్లు, విత్తనాలు వేసే యంత్రాలు, పంట నూర్పిడి చేసే యంత్రాలు) మార్కెట్లో లభించే అద్దెకంటే 10 శా తం తగ్గించి రైతులకు ఇస్తారు. దీని ద్వారా రైతులకు కొంత లాభం కలిసి వస్తుంది. సమయానికి వ్యవసాయ కూలీలు దొరక్కపోతే మండలాల్లోని ఎఫ్పీసీల ద్వారా యంత్రాలను అద్దెకు తీసుకొని వ్యవసాయ పనులను పూర్తి చేసుకోవచ్చు. యంత్రా ల నిర్వహణకు మండల స్థాయిలో సీఈవో ఉంటా రు. అతడికి ఆయా యంత్రాల మరమ్మతులు, ఎవరికైనా అద్దెకు ఇచ్చే విషయాలపై పూర్తి అవగాహన ఉంటుంది. అంతేగాకుండా విలేజ్ లెవల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ కూడా ఉంటుంది. గ్రామాల్లో రైతు లు పండించిన పంటలను ఆ కమిటీ సభ్యులు సేకరిస్తారు. ఇలా సేకరించిన పండ్లు, కూరగాయాలు, ఇతర చిరుధాన్యాలను మార్కెట్‌కు తరలిస్తారు. ఉత్పత్తిదారుల సంఘాలు నేరుగా రైతుల నుంచి సేకరించిన పంటలను హైదరాబాద్‌లోని బోయినపల్లి మార్కెట్‌కు తరలిస్తారు. దీనివల్ల రైతులకు రవాణా, కమీషన్ ఏజెంట్ల బెడద తప్పుతుంది. సంఘాల సభ్యులే మార్కెట్లో విక్రయిస్తారు.
యంత్రాలతో రైతులకు లాభం
ఉత్పత్తిదారుల సంఘాలతో రైతులకు మేలు జరుగుతున్నది. వ్యవసాయం చేసే రైతులకు మార్కెట్ ధరకంటే తక్కువగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్రాలను సంఘాల ద్వారా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా రైతుల ఉత్పత్తులను సం ఘంలోని ప్రతినిధులు మార్కెటింగ్ చేస్తారు. తద్వా రా రైతులకు లాభాలొస్తాయి. భవిష్యత్తులో మరిన్ని మండలాలకు ఉత్పత్తిదారుల సంఘాలను విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
– శేఖర్, డీపీఎం రీజినల్ కో-ఆర్డినేటర్