వికారాబాద్, నవంబర్ 22 : కాంగ్రెస్ పాలనలో వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి జరగకపోవడంతో పట్టణ ప్రజల ఆశలు ఆవిరి అవుతున్నాయి. మున్సిపల్‌కు నిధులు వస్తే ముందుగా వెనుకబడిన వార్డులను అభివృద్ధి చేస్తారని ఆయా వార్డుల ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. టీఎఫ్ఐడీసీ కింద మున్సిపల్‌కు రెండు సంవత్సరాల క్రితం రూ.60 కోట్లు మంజూరయ్యాయి. అదనంగా ప్రత్యేక నిధులు రూ.18.70 కోట్లు మంజూరైనట్లు మాజీ ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. అయినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో పట్టణ ప్రజలు కాంగ్రెస్ పాలనపై మండిపడుతున్నారు. వికారాబాద్ మున్సిపల్లో 34 వార్డులున్నాయి. ఇందులో 6 వార్డులు గ్రామపంచాయతీ నుంచి మున్సిపల్లో కలిశాయి.
అభివృద్ధికి నోచుకోని వెనుకబడిన వార్డుల్లో ప్రధానంగా ఈ నిధులు ఖర్చు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీలు, నీటి సమస్యలను పరిరక్షించేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కాని ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం.. అభివృద్ధి జరగకపోవడంపై పట్టణ ప్రజలు కాంగ్రెస్ పాలన తీరుపై మండిపడుతున్నారు. కాగితాలకే కోట్ల రూపాయలు పరిమితమవుతున్నాయి తప్ప.. వార్డుల అభివృద్ధి ఇంకా ఎప్పుడు ప్రారంభం అవుతుందని పట్టణ ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు.