మంచాల, జనవరి 25 : గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయిస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆగపల్లి నుంచి మంచాల వరకు బీటీ రోడ్డుతో పాటు సీసీరోడ్డు ఏర్పాటు కోసం రూ. 2.85 కోట్లు, కాగజ్ఘట్లో నూతన గ్రామ పంచాయతీ రూ. 20 లక్షలు, సీసీరోడ్డు భూగర్భ డ్రైనేజీ కోసం రూ. 22 లక్షలు, జాపాలలో గ్రామ పంచాయతీ భవనంతో పాటు సీసీరోడ్లకు రూ. 30 లక్షలు, అస్మత్‌పూర్‌లో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 20 లక్షలు, సీసీ రోడ్డు ఏర్పాటు కోసం రూ.20 లక్షలతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధులతో గ్రామంలో సమస్యలను పరిష్కరించడమే కాకుండా నూతన గ్రామ పంచాయతీ భవనాల ఏర్పాటు కోసం 5 గ్రామ పంచాయతీలకు రూ. 20లక్షల చొప్పున కేటాయించి పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు.
అడిగిన వెంటనే అదనంగా నిధులు
మండల పరిధిలోని అస్మత్పూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ శంకుస్థాపన పనులు ప్రారంభించిన అనంతరం అక్కడికి వచ్చిన మహిళలు, గ్రామస్తులతో ఎమ్మెల్యే మాటముచ్చట నిర్వహించారు. అస్మత్పూర్ నుంచి మంచాల రోడ్డు వరకు బీటీ రోడ్డు వేయాలని అడిగిన వెంటనే త్వరలో నిధులు కేటాయిస్తానని చెప్పారు. డ్వాక్రా భవనం ఏర్పాటు కోసం గతంలో ఇచ్చిన రూ. 10 లక్షలు సరిపోవడం లేదని మహిళలు చెప్పడంతో.. అడిగిన వెంటనే మరో రూ. 5లక్షలు కేటాయించారు. అస్మత్పూర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన చాంద్‌ఖాన్ గూడలో డంపింగ్‌యార్డు, వైకుంఠధామం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పడంతో వెంటనే రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులను గ్రామంలో పర్యటించి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ నిత్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు వాజీద్, సర్పంచ్‌లు గోసుల జంగయ్య యాదవ్, పంది ఆండాళు, నహీదాబేగం, నౌసు హరిప్రసాద్, ఎంపీటీసీ శేఖర్‌రెడ్డి, ఉపసర్పంచ్లు గొడుగు రాధిక, మల్లప్ప, ఎంపీడీవో శ్రీనివాస్, డీఈ అబ్బాస్, ఈవోఆర్డీ తేజ్‌సింగ్, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.