వరికి బోనస్ కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు రైతులను మోసం చేస్తున్నది. అన్ని రకాల వడ్లకు మద్దతు ధరపై క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన రేవంత్… అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశాడు. సన్నాలకే బోనస్ ఇస్తామని చెప్పడంతో జిల్లా రైతాంగం తీవ్ర నిరాశకు గురవుతున్నది. జిల్లాలో 27,425 ఎకరాల్లో దొడ్డు రకం వరిని, 1,01,355 ఎకరాల్లో సన్నరకం వరిని రైతాంగం సాగు చేసింది. సన్నాలకే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దొడ్డు రకం సాగు చేసిన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. అలాగే.. సన్నరకం ధాన్యం కొనుగోళ్లలోనూ ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతుండడంతో బోనస్ దక్కుతుందో ? లేదో ! అని రైతాంగం ఆందోళన చెందుతున్నది.
– రంగారెడ్డి, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ)
సన్నాలకు గింజను కొలిచి.. బోనస్ ఇస్తారట..
గింజను కొలిచి బోనస్ ఇచ్చేలా ప్రభుత్వం కొత్త నిబంధనను అమలులోకి తేనుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. చిన్నచిన్న వస్తువుల పొడువు, వెడల్పు కొలతలను లెక్కించడం కోసం వినియోగించే కాలిపర్స్ పరికరాన్ని సన్నధాన్యాన్ని గుర్తించేందుకు వినియోగించనున్నారు. ఇందుకు పౌరసరఫరాల శాఖ ఇప్పటికే భారీ సంఖ్యలో కాలిపర్స్ పరికరాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది.
ప్రతి కొనుగోలు కేంద్రానికి కనీసం రెండు చొప్పున పరికరాలను ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చే ధాన్యంలో కొన్ని గింజలను సేకరించి పొట్టు తీశాక బియ్యం గింజను కాలిపర్స్ ద్వారా కొలతేస్తారు. ఈ కొలతలో బియ్యం గింజ పొడవు 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. వెడల్పు మిల్లీమీటరుకు మించొద్దు. బియ్యపు గింజ పొడవు, వెడల్పుల నిష్పత్తి 2.5 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా ఉండాలి. కాలిపర్స్‌లో పెట్టిన బియ్యపు గింజ ఈ కొలతలకు సరిపోతేనే దాన్ని సన్నధాన్యంగా పరిగణిస్తారు. ఆ ధాన్యానికే రూ.500 బోనస్‌ను ప్రభుత్వం చెల్లించనున్నది.
బోనస్ ఎగ్గొట్టేందుకేనా !
బోనస్‌ను ఎగ్గొట్టి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నరకం ధాన్యాలు ఏమిటన్న దానిపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. బీపీటీ-5202 తోపాటు ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరాం రకాలతో పాటు మరో 33 రకాలను సన్న ధాన్యంగా పరిగణించాలని ప్రభుత్వం సూచించింది. ఈ 37 రకాల్లో రంగారెడ్డి జిల్లాలో పండించేది ఐదు నుంచి ఆరు రకాలు ఉంటాయి.
అలాంటప్పుడు ఈ కొలతలు దేనికని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ శాఖ సన్నాల కింద ప్రకటించిన జాబితాలో రైతు పండించిన ధాన్యం ఉన్నా.. కొలతల్లో తేడా వస్తే దొడ్డు కింద పరిగణిస్తే.. ఎలాగని రైతులు పేర్కొంటున్నారు. ఒక్కో వ్యవసాయ క్షేత్రంలో భూసారాన్ని బట్టి గింజ పరిమాణంలో తేడా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కొలతల పేరుతో కొర్రీలు పెట్టి బోగస్ ఎగ్గొట్టేందుకే ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం తెరపైకి తెస్తున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
సన్నాలు ఇక ప్రైవేటుకేనా..
ఓపెన్ మార్కెట్లో సన్నాలకు మంచి ధర ఉంటుండడంతో సదరు ధాన్యం ప్రైవేటుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు 2,300 మద్దతు ధర ఇస్తున్నది. ‘ఏ’ గ్రేడ్‌కు రూ.2,320 చెల్లిస్తున్నది. ఈ లెక్కన సన్నాలు విక్రయిస్తే.. బోనస్ రూ.500లతో కలిపి క్వింటాలుకు రూ.2,820 గరిష్ఠంగా వస్తాయని, అదే బయట మార్కెట్లో అయితే మరింత ఎక్కువ ధర పలికే అవకాశం ఉన్నదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం సన్నాలకు మార్కెట్లో రూ.2,700 నుంచి రూ.2,800 వరకు ధర పలుకుతున్నది.
ఈ ధర రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని రైతులు అంటున్నారు. దీంతో మెజార్టీ రైతులు బహిరంగ మార్కెట్లో సన్నరకం వరి ధాన్యాన్ని విక్రయించే అవకాశాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు సైతం పేర్కొంటున్నారు. బోనస్ ప్రకటన వల్ల జిల్లా రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూరదని, పైగా దొడ్డురకం వరి వెరైటీని సాగు చేసిన రైతులకు నష్టం కలుగుతున్నదని రైతాంగం వాపోతున్నది.