ఆదిబట్ల/ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 8 : అవుటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న అత్యంత ఖరీదైన జిలాన్‌ఖాన్ చెరువుపై కబ్జాదారుల కన్ను పడింది. కొందరు రియ ల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు పక్కన ఉన్న పట్టా భూమితోపాటు చెరువు భూమిని కూడా ఆక్రమించి అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అతి పొడవైన పులిందర్ వాగుకు నీరందించడంలో జిలాన్‌ఖాన్ చెరువు అతి ముఖ్యమైనది.
ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరు గ్రామంలోని సర్వేనంబర్ 123, 124, 125లలో ఈ చెరువు విస్తరించి ఉన్నది. ఈ చెరువు పుల్ట్యాంక్ లెవల్ 25 ఎకరాలుగా హెచ్ఎండీఏ అధికారులు నిర్ధారించి హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. కాగా చుట్టు పక్కన ఉన్న రైతులు సగం వరకు ఈ చెరువును చెరబట్టారు. అయితే అవుటర్ రింగ్‌రోడ్డును ఈ చెరువు మధ్య నుంచి ఏర్పాటు చేయడంతో రోడ్డుకు ఇరువైపులా చెరువు స్థలం ఉన్నది.
సర్వీస్ రోడ్డు ఏర్పాటుతో శిఖం పట్టా రైతులకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని కూడా చెల్లించింది. అయితే పరిహారం పొందిన రైతులే సర్వీస్ రోడ్డులో పోయిన శిఖం భూమిని చెరువులో చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారు. దీంతో ఓ పేరు పొందిన రియల్ ఎస్టేట్ సంస్థ జిలాన్‌ఖాన్ చెరువులో అపార్ట్మెంట్ల నిర్మాణానికి పూనుకున్నది. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు మాత్రం అటువైపు చూడడం లేదు. రియల్ వ్యాపారులు హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాటు చేసిన హద్దురాళ్లనూ తొలగించి చెరువును మట్టితో పూడ్చివేస్తున్నారు.
చెరువు ఉనికికే ప్రమాదం..
నియోజకవర్గంలోని పలు గొలుసు కట్టు చెరువులతోపాటు పులిందర్ వాగుకు నీరందించే జిలాన్‌ఖాన్ చెరువు ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఈ చెరువు అవుటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉండడం.. ఈ ప్రాంతంలో భూముల ధరలు అధికంగా ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను చెరువు స్థలంపై పడింది. దీంతో చెరు వు బఫర్ జోన్లో కొందరు రాత్రికి రాత్రే మట్టి పోసి..పూడ్చివేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు కంటైనర్లను ఏర్పాటు చేసుకుని మరీ గస్తీ కాస్తున్నారు. రోడ్డుపై వెళ్లే వారికి చెరువులో ఏమి జరుగుతుందో తెలియకుండా ఉండేందుకు చెరువు చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మించి ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు స్పందించి చెరువు స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.