వికారాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. వానకాలం ప్రారంభం కావడంతో డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశమున్న దృష్ట్యా వాటి నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పలు గ్రామాల్లోని ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల నిర్వహణకు నయా పైసా కూడా కేటాయించకపోవడంతో పల్లెల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిపోయింది. మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో ఆ నీరు నిల్వ ఉండడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం తదితర కారణాలతో డెంగీ, మలేరియా, టైపాయిడ్, డయేరియా, కలరా తదితర వ్యాధులు వ్యాపిం చే అవకాశాలున్నాయి. గతంలో జిల్లాలో డెంగీ కేసులు నమోదైన దృష్ట్యా జిల్లా యంత్రాంగం చర్య లు చేపట్టాల్సిన అవసరం ఉంది.
వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం..
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో అవగాహన కార్యక్రమాలు, వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలను వైద్యారోగ్య శాఖ అధికారులు తీసుకోలేదు. సీజనల్ కేసుల నమోదు పెరిగినట్లయితే జిల్లావ్యాప్తం గా ఫీవర్ సర్వే నిర్వహించి వ్యాధి లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతారు కానీ ఇప్పటివరకు అలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. అంతేకాకుండా ప్రతి ఏటా డెంగీ తో చాలా మంది మృతిచెందుతున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లోనూ డెంగీ వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచేందుకు ఎలాంటి ప్రణాళిక లేకపోవడం గమనార్హం. అయితే వాతావరణం చల్లబడడంతోపాటు ఓ మోస్తరు నుంచి ముసురు కురుస్తున్నది.
దీంతో సీజనల్ వ్యాధులూ ప్రబలే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే చలి, జ్వరాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. వానలు పడుతుండడంతో నీటి కాలుష్యం పెరగడంతోపాటు డ్రైనేజీ నీరు తాగునీటి పైపుల్లోకి చేరి డయేరియా, కామెర్లు తదితర వ్యాధులు వచ్చే అవకాశమున్నది. మురుగు నీరు ఉండడంతో దోమలు కూడా వ్యాప్తి చెందుతాయి. వాటితో డెంగీ, మలేరియా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తం..
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిపోయింది. బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ పంచాయతీలుగా మారిన పలు గ్రామాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మురుగునీటి ప్రవాహం, చెత్తాచెదారమే దర్శనమిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో పల్లెలు చాలా శుభ్రంగా ఉండేవి. అయితే, పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులకు ఏడాదికిపైగా ప్రస్తుత రేవంత్ సర్కార్ జీతాలు చెల్లించకపోవడంతో వారు పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ చూపడం లేదు. మరోవైపు గ్రామాల్లో డ్రైనేజీ పైప్లైన్ల లీకేజీలకు మరమ్మతులు చేయకపోవడంతో డ్రైనేజీ వ్యర్థాలతో రోడ్లన్నీ అపరిశుభ్రంగా మారుతున్నాయి.