వికారాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ వచ్చి గ్రామ పంచా యతీలను నిర్వీర్యం చేసింది. పవర్లోకి వచ్చి 23 నెలలు దాటినా పల్లెలకు రూపాయీ కేటాయించకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారి ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. సర్పంచ్ల పదవీకాలం పూర్తైన వెంటనే పేరుకు ప్రత్యేకాధికారులను నియమించినా పరిస్థితి మారలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే వెక్కిరిస్తున్నాయి. కనీసం చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్లకు డీజిల్ పోయించేందుకూ గ్రామ పం చాయతీల్లో డబ్బులు లేకపోవడంతో కేసీఆర్ హయాంలో మంజూరైన ట్రాక్టర్లు మూలనపడ్డాయి.
అదేవిధంగా ప్రతిరోజూ పల్లెలను శుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికులకు సక్రమంగా జీతాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్లు, చిన్న చిన్న పనులకు సొంత డబ్బును వెచ్చించిన పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికీ పెండింగ్ బకాయిలు రాకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా మారింది. ఇలా జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి రూ.29 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. గత రెండేండ్లు వేసవికాలానికి ముందు కాంట్రాక్టర్లు తాగునీటి మరమ్మతుల కోసం రూ. నాలుగు కోట్ల వరకు ఖర్చు చేయగా.. ఆ నిధులు ఎప్పుడు వస్తాయోనని వారు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
సమస్యలతో సహవాసం.. కుంటుపడిన అభివృద్ధి
పంచాయతీల్లో పాలన అధ్వానంగా, అస్తవ్యస్తంగా మారింది. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. సర్పంచ్ల టర్న్ ముగియడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. మరోవైపు పంచాయతీల్లో నిధుల లేమితో ప్రత్యేకాధికారులు పల్లెల చుట్టూ చూడడమే మానేశారు. జిల్లా ఉన్నతాధికారులు గ్రామ పంచాయతీల్లో పర్యటిస్తే తప్ప ప్రత్యేకాధికారులు ఊర్లకు రావడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో స్వచ్ఛ పంచాయతీలుగా పేరొందిన పలు గ్రామాల్లోనూ పాలన పడకేసింది.
పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమలు చేసి దేశంలో ఎక్కడాలేని విధంగా పచ్చని పల్లెలుగా అవార్డులను సొంతం చేసుకున్న పలు గ్రామాలు.. రేవంత్ పాలనలో అస్తవ్యస్తంగా మారాయి. నిధుల లేమితో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. గత 23 నెలలుగా పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో కనీసం డ్రైనేజీ పైప్లైన్లను మరమ్మతులు చేయలేని దుస్థితి నెలకొన్నది. ట్రాక్టర్లకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితితోపాటు ట్రాక్టర్ల నిర్వహణకు కనీసం డీజిల్ పోయించేందుకు డబ్బులు లేకపోవడంతో వాటి నిర్వహణ భారంగా మారింది. ట్రాక్టర్లు మూలన పడడంతో ఇంటింటి నుంచి తడి-పొడి చెత్త సేకరించే ప్రక్రియ గ్రామాల్లో నిలిచిపోయింది. దీంతో గ్రామాల్లో ఎక్కడా చూసిన చెత్తాచెదారంతో నిండిపోయాయి. ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.