వికారాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్న పల్లెల్లో పాలన పడకేసింది. ‘పల్లె ప్రగతి’తో దేశంలోనే ఎక్కడాలేని విధంగా అభివృద్ధి చేసుకుని అవార్డులను సొంతం చేసుకున్న గ్రామాలు ఏడాదిలో కాలంలోనే అస్తవ్యస్తంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా నిధులు రాక సమస్యలు పేరుకుపోయాయి. గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల్లో సమస్యలను పట్టించుకోకుండా ఎనిమిది నెలలుగా ప్రత్యేకాధికారుల పాలనను కొనసాగిస్తున్నది.
కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. చిన్న చిన్న కాంట్రాక్టర్లతో చేయించిన పనులకే ఇవ్వాల్సిన రూ.4 కోట్ల నిధులు రాకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలు ఆదర్శంగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పల్లెల్లో పరిస్థితి అధ్వానంగా మారిందని పల్లెజనం ఆరోపిస్తున్నారు. గత ఎనిమిది నెలలుగా పంచాయతీ కార్మికులకూ జీతాలు ఇవ్వకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పంచాయతీల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.
కనీసం డ్రైనేజీ పైప్‌లైన్ మరమ్మతు కూడా చేయలేని పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అద్దంలా మెరిసిన పల్లె రోడ్లు.. ప్రస్తుతం మురుగు నీటితో దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ పైప్‌లైన్ లీకేజీలతో దుర్గంధంగా మారాయి. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లు మూలన పడ్డాయి. ట్రాక్టర్లకు ఈఎంఐ కట్టకపోవడంతోపాటు కనీసం డీజిల్‌కు కూడా డబ్బులు లేని పరిస్థితి దాపురించింది.
దీంతో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే ప్రక్రియ నిలిచిపోయింది. ఏ గ్రామాన్ని చూసినా చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నది. ఇండ్ల మధ్యలోనే చెత్త కుప్పలతో డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. మరికొన్ని గ్రామాల్లో అయితే కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేకపోతుండడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 29 గ్రామ పంచాయతీలు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులను సొంతం చేసుకుని దేశంలోనే ఆదర్శ పంచాయతీలుగా గుర్తింపు పొందగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే ఆధ్వానంగా మారడం గమనార్హం.