జిల్లాలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు శాశ్వత సాగు, తాగునీరు అందించే రాచకొండ ఎత్తిపోతల పథకానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. శివన్నగూడ రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా ఈ పథకాన్ని రూపొందించడం కోసం రూ.1.72 కోట్లతో రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం ఆధ్వర్యంలో సర్వే చేసి డీపీఆర్‌ను సిద్ధం చేసి అందించింది. కాని, సర్కారు మారడంతో రాచకొండ ఎత్తిపోతల పథకానికి గ్రహణం పట్టినట్లయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రాజెక్టు పనులు ముందుకు సాగడానికి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. దీంతో ఈ పథకం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఈ పథకం పూర్తయితే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో 84 వేల ఎకరాలకు సాగునీటితోపాటు ప్రజలకు తాగునీరు లభించే అవకాశాలున్నాయి. కాని, ఈ ప్రాంత పాలకులు ఈ ప్రాజెక్టు పురోగతిపై దృష్టి సారించకపోవడంతో ఈ పథకం ముందుకు సాగడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. ఈ పథకం పూర్తి చేయడానికి నిధులు తీసుకురావడం కోసం సర్కారుపై ఒత్తిడి తీసుకురావాల్సిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపడంలేదనే ఆరోపణలొస్తున్నాయి.
– రంగారెడ్డి, మార్చి 21 (నమస్తే తెలంగాణ)
శివన్నగూడ రిజర్వాయర్ నుంచి మూడు లిఫ్టుల ద్వారా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించేందుకు గతంలోనే ప్రతిపాదనలు రూపొందించారు. మొదటి లిఫ్టును లోయపల్లి సమీపంలోని కండరాయిని చెరువు వద్ద నిర్మించాలని, రెండో లిఫ్టును ఆరుట్ల సమీపంలోని గంగదేవుని గుట్టపైన, మూడో లిఫ్టును వాయిల్లపల్లి వద్ద నిర్మిం,ఆలని తీర్మానించారు. ఈ లిఫ్టుల ద్వారా పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకు సాగు, తాగునీరు అందించాల్సి ఉన్నది.
122 చెరువులకు కాల్వల ద్వారా నీరు
శివన్నగూడ రిజర్వాయర్ నుంచి లిఫ్టు ద్వారా నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారి పక్కన తులేకలాన్ సమీపంలో సర్వే నం.205లో మినీ రిజర్వాయర్ నిర్మించి కాల్వల ద్వారా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని 122 పెద్ద, చిన్న చెరువులను నింపాలని బీఆర్ఎస్ హయాంలో ప్రతిపాదనలు తయారుచేశారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం పెద్దచెరువు, రావిర్యాల చెరువు, ఆకులమైలారం చెరువు, లోయపల్లి కండరాయిని చెరువును నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రూ.1.72 కోట్లతో సర్వే పనులు
శివన్నగూడ రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో 84 వేల ఎకరాలకు సాగునీటితోపాటు గ్రామాలకు తాగునీరు అందించే పథకాన్ని రూపొందించడం కోసం గత కేసీఆర్ సర్కారు రూ.1.72 కోట్లను కేటాయించింది. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఎత్తైన ప్రదేశంలో 3 రిజర్వాయర్లు నిర్మించి అక్కడి నుంచి సాగునీరు అందించే పథకానికి రూపకల్పన చేశారు. కాని, ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్టు పనులు మూలన పడ్డాయి.
పాలకుల నిర్లక్ష్యంతో నిధులు రావడంలేదు
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గ్రహణం పట్టింది. ఈ పథకం పురోగతిపై పాలకులకు చిత్తశుద్ధిలేదు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు శాశ్వత సాగునీరు అందించాలంటే రాచకొండ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే. కాని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పురోగతిపై కత్తిగట్టింది. రెండేళ్లలో కాంగ్రెస్ సర్కారు ఈ ప్రాజెక్టుకు పైసా కేటాయించలేదు.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
వెంటనే నిధులు కేటాయించాలి
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల రైతులకు శాశ్వత సాగునీరు అందిచాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం రూపొందించిన రాచకొండ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలి. శాశ్వత సాగునీరు లేకపోవడంతో ప్రతి ఏటా రైతులు అప్పులు చేసి సాగు చేసిన పంట పొలాలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారు. సముద్రమట్టానికి 630అడుగుల ఎత్తులో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు అనువైనది ఒక్క రాచకొండ ఎత్తిపోతల పథకమే. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిధులు కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవాలి.
– సత్తు వెంకటరమణారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్