కడ్తాల్, సెప్టెంబర్ 29 : రంగారెడ్డి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువుదీరిన మైసమ్మ దేవత, శివాలయ, రామాలయాల్లో దసరా దేవీశరన్నవరాత్రుల మహోత్సవాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 3 నుంచి 12 వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే శరన్నవరాత్రుల ఉత్సవాలకు ఆలయ సిబ్బంది, నిర్వాహకులు ముమ్మర ఏ ర్పాట్లు చేస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ప్రతి రోజూ ఒక్కో దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఆలయాలను వివిధ రకాల పూలు, తోరణాలు, విద్యుత్‌దీపాలతో అందం గా ముస్తాబు చేస్తున్నారు. ఆలయం ముందు ఉన్న కోనేరు భక్తులను ఆకట్టుకుంటున్నది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శిరోలిపంతూనాయక్, ఈవో స్నేహలత తెలిపారు.
రోజుకో అలంకారంలో..
శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈ నెల 3న శ్రీఅన్నపూర్ణేశ్వరీదేవి అలంకారంలో, 4న శ్రీబాలాత్రిపుర సుందరిదేవిగా, 5న శ్రీగాయత్రీదేవిగా, 6న భవానీ దేవిగా, 7న శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా, 8న శ్రీమహాలక్ష్మీదేవిగా, 9న శ్రీసరస్వతీదేవిగా, 10న దుర్గాదేవిగా, 11న ఉదయం మహిషాసుర మర్దనిగా, 12న శ్రీరాజరాజేశ్వరీదేవి (విజయ దశ మి రోజు)గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నా రు. ఉత్సవాలకు రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్, నల్లొండ జిల్లాలకు చెందిన భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
జయప్రదం చేయాలి..
దసరా శరన్నరాత్రుల ఉత్సవాలకు ఆలయాలను శోభాయమానంగా ముస్తాబు చేస్తున్నాం. పది రోజులపాటు నిర్వహించే దేవీశరన్నవరాత్రుల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ఆవరణలో అన్ని ఏర్పా ట్లు చేస్తున్నాం. ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతులు, సదుపాయాలు కల్పిస్తాం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలి.
– శిరోలీపంతూనాయక్, ఆలయ
వ్యవస్థాపక ధర్మకర్త, మైసిగండి ఆలయం అన్ని వసతులు కల్పిస్తాం..
మైసిగండి గ్రామంలోని రామాలయ, శివాలయాల్లో శరన్నవరాత్రుల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తు న్నాం. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయం లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఉత్సవాలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఆల య ఆవరణలో అన్ని వసతులు కల్పిస్తాం. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
-స్నేహలత, ఈవో, మైసిగండి మైసమ్మ ఆలయాలు