శివరాత్రి పర్వదినానికి దేవాలయాలు ముస్తాబు
విద్యుత్ కాంతుల మధ్య ధగ ధగ మెరుస్తున్న శివాలయాలు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
పెరిగిన పండ్లు, పూల విక్రయాలు
షాద్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 28 : ఫరూఖ్‌నగర్ మండలం రామేశ్వరంలోని ఉత్తర రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల కొంగుబంగారంగా విరాజజిల్లుతున్నది. రామలింగేశ్వర స్వామిని మనసా స్మరించుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. ఆలయ సమీపంలో పార్వతీదేవి, విఠలేశ్వర ఆలయం ఉన్నది. దీంతో పాటు మహాశివరాత్రి సందర్భంగా లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.
రామేశ్వరంలో ఏర్పాట్లు పూర్తి..
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉత్తర రామలింగశ్వరస్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్యాంసుందరచారి తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులను సమకూర్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వసతులు ఇలా..
స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ అధికారులు తెలిపారు. తాగునీటి వసతి, వైద్య సదుపాయం, బారికేడ్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ క్యూలో ఉండాలని తెలిపారు. కోనేరులో నీటిని శుద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలల్లో శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడరును చల్లామన్నారు . ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
దర్శనాలు ఇలా..
శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని కేవలం స్వామి వారి స్పర్శదర్శనం మాత్రమే ఉంటుంది. స్పర్శ దర్శనానికి రూ.100, శీఘ్ర దర్శనానికి రూ.50 వసూలు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వీఐపీ దర్శనాలకు రూ.200లు వసూలు చేయనున్నారు.
ఆలయానికి రూటు ఇలా..
షాద్‌నగర్ పట్టణం నుంచి సుమారు 7 కిలోమీటర్లు దూరంలో ఉత్తర రామలింగశ్వేర స్వామి ఆలయం ఉన్నది. జాతీయ రహదారి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కలదు. జాతీయ రహదారిపై ఆలయ ముఖద్వారం ఉంటుంది. షాద్‌నగర్ ఆర్టీసీ డిపోనుంచి ప్రత్యేక బస్సులు ఉన్నాయి. అంతేకాకుండా ముఖద్వారం నుంచి ప్రైవేటు ఆటోల సౌకర్యం ఉంది.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..
శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. అందరికీ అర్థమయ్యేలా బోర్డులు పెట్టాం.
– శ్యాంసుందరాచారి,ఆలయకార్యనిర్వహణ అధికారి, రామేశ్వరం
ప్రతి ఒక్కరూ సహకరించాలి..
రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే స్పర్శదర్శనం మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరూ సహకరించాలి. అనివార్య సంఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
– సంపత్‌కుమార్, సర్పంచ్, రామేశ్వరం