రంగారెడ్డి, జూలై 29(నమస్తే తెలంగాణ) : జిల్లాలో అర్హులైన వేలాదిమంది రైతులకు సంబంధించిన రూ.లక్ష రుణ మాఫీ కాలేదు. రేషన్ కార్డులేని వారిని అనర్హులను చేయడం.. పీఎం కిసాన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్లనే చాలామందికి రుణ మాఫీ కలగలేదు. జాబితాలో పేరున్నప్పటికీ.. ఖాతాల్లో మాఫీ డబ్బులు జమకాని రైతులు ఇంకా జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రభుత్వం మంగళవారం రూ.1.50 లక్ష రుణాలు తీసుకున్నవారికి మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి కలెక్టరేట్లో లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే సోమవారం సాయంత్రం వరకు కూడా రెండో విడత మాఫీకి సంబంధించిన అర్హుల జాబితా జిల్లాకు రాలేదు. దీంతో మంగళవారం నాటి కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానించాలనే విషయంలో అధికారవర్గాల్లో సందిగ్ధత నెలకొన్నది.
ఇదిలా ఉండగా.. మాఫీ ప్రక్రియ ఆసాంతం అవే షరతులు.. అవే నిబంధనలను అమలు చేస్తుండడంతో రెండో విడత సైతం మొదటి విడత మాదిరిగా గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రుణమాఫీకి అరకొరగానే కేటాయింపులు జరపడంతో రెండు, మూడు విడతల్లో ఏ మేరకు కోత ఉంటుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొన్నది.
మొదటి దఫాలో వేలాది మందికి మొండిచెయ్యి..
రుణమాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం రుణమాఫీలో అనేక కొర్రీలు పెట్టింది. ఫలితంగా మొదటి విడతలో అర్హులైన ఎంతోమంది రైతుల అప్పులు మాఫీ కాలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రంగారెడ్డి జిల్లాలో 49,741 మంది రైతులకు రూ.278.06 కోట్ల రుణమాఫీని చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. అర్హులైన వారు లక్షకు పైగానే ఉన్నట్లు తెలుస్తున్నది.
సహకార సొసైటీల్లో రుణాలు తీసుకున్న చాలామంది రైతులకు రుణమాఫీని వర్తింపజేయలేదు. ఇక.. జాబితాలో పేర్లు వచ్చిన రైతులకు సైతం నేటికీ సాయం అందలేదు. మొదటి రోజున 48,239 మంది రైతులకు సంబంధించి రూ.250కోట్ల మేర రుణమాఫీ డబ్బులు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ అయినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఇంకా.. 1,502 మంది రైతులకు సంబంధించి రూ.28 కోట్లకు పైగా మాఫీ డబ్బులు ఖాతాల్లో జమకావాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో జమకాలేదు.
మరో జాబితా ఉందంటూ.. బుకాయింపు..
రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను రైతులకు తెలిపేందుకు ప్రభుత్వం ఏవో, ఏఈవోలకు ప్రత్యేక యాప్‌లను ఇచ్చింది. రైతుల ఆధార్‌కార్డు ఆధారంగా అధికారులు మాఫీ కాకపోవడానికి గల కారణాలను చెబుతున్నారు. అయితే సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామని రైతులకు సర్దిచెప్పి పంపిస్తున్నారు. గట్టిగా నిలదీస్తే.. మరో జాబితా వస్తుందని, అందులో మీ పేర్లు వచ్చే అవకాశం ఉందని బుకాయిస్తున్నారు.
మరోపక్క.. జాబితాలో పేరు వచ్చి ఖాతాల్లో మాఫీ డబ్బులు జమకాకపోవడానికి అధికారులు అనేక కారణాలు చెబుతున్నారు. ఖాతాల్లో పేర్లకు, ఆధార్‌కు మధ్య తేడా కారణంగానే మాఫీ డబ్బులు జమకాలేదని పేర్కొంటున్నారు. కొంతమంది రైతుల ఖాతాలకు సంబంధించి ప్రీ ఆడిట్ నిర్వహణకు వ్యవసాయ శాఖ సిద్ధ్దమవుతున్నది. ఆయా ఖాతాలకు సంబంధించిన రైతులు ఎంత మేరకు రుణాలు తీసుకున్నారు?.
వడ్డీ ఎంత అయింది? ఎంత చెల్లించారు!. రెన్యువల్ ఖాతాలెన్ని? రెన్యువల్ తర్వాత బ్యాంకులేమైనా రుణాలిచ్చాయా? తదితర అంశాల వారీగా ప్రీ ఆడిట్‌ను నిర్వహించనున్నారు. ఇలా.. పరిశీలించే ఖాతాలకు ఆడిట్ పూర్తయ్యే వరకు నిధులు జమచేయడం లేదు. ఈ కారణంగానూ జాబితాలో పేరున్న రైతుల ఖాతాల్లో మాఫీ డబ్బులు జమకాలేదు. ఆగిపోయిన మాఫీ డబ్బులను తిరిగి ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారని ప్రశ్నించిన రైతులకు అధికారుల నుంచి స్పష్టమైన సమాధానమే కరువైంది.