అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ ముందుకెళ్తున్నది. ఇప్పటికే బీసీ కులాల వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున సాయాన్ని అందజేస్తున్న ప్రభుత్వం మైనార్టీలకూ అందించాలని నిర్ణయించింది. రూ.లక్ష సాయంతో మైనార్టీల్లోని పేదరికాన్ని సమూలంగా తొలగించే దిశగా చర్యలు తీసుకుంటున్నది. ఇదివరకే విద్య, ఉపాధి తదితర రంగాల్లో చేయూతనిస్తుండగా.. ఈ పథకంతో మైనార్టీలకు మరింత మేలు జరుగనున్నది. మైనార్టీల్లోని చేతి వృత్తిదారులకు బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా నేరుగా సాయాన్ని అందజేయనున్నది. కలెక్టర్ ఆధ్వర్యంలో త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలుకానున్నది. అర్హులైన క్రిస్టియన్లకు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, ముస్లిం, సిక్కు, బుద్దిస్ట్, జైన్, పార్శీ మతాలకు చెందినవారికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సాయాన్ని అందిస్తారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలమందికి మేలు జరుగనున్నది. రూ.లక్ష సాయంపై మైనార్టీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆది నుంచి మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
వికారాబాద్, జూలై 24, (నమస్తే తెలంగాణ) : ఆర్థికంగా వెనుకబడిన వర్గాల బలోపేతమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే బీసీలకు ఆర్థిక చేయూతనందిస్తుండగా, తాజాగా మైనార్టీలకూ ఆర్థిక చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం మైనార్టీలకు రూ.లక్ష సాయం అందజేసేందుకుగాను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బీసీ కులవృత్తులు, ఎంబీసీ కులాలకు ఆర్థిక చేయూతనందిస్తున్న సీఎం కేసీఆర్ తాజాగా ముస్లిం, క్రిస్టియన్లకూ ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచేందుకు నిర్ణయించింది. మైనార్టీలకు వంద శాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థిక సాయం అందజేసేందుకు నిర్ణయించడంతో మైనార్టీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.లక్ష సాయం అందజేయడంపై జిల్లావ్యాప్తంగా ముస్లిం, క్రిస్టియన్లు సంబురాలు నిర్వహించారు. 2023 జూన్ 2 నాటికి 21 ఏండ్ల నుంచి 55 ఏండ్ల మధ్య ఉన్న మైనార్టీలకు రూ.లక్ష సాయం అందజేయనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అయితే కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించరాదని ప్రభుత్వం నిబంధన పెట్టింది. బీసీ కులవృత్తుల మాదిరిగానే కుటుంబంలో ఒక్కరికీ మాత్రమే మైనార్టీలకు రూ.లక్ష సాయం అందనున్నది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం విధివిధానాలను జారీ చేసింది. త్వరలోనే అర్హులైన మైనార్టీల నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. మైనార్టీ కార్పొరేషన్లో భాగంగా స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులున్నట్లయితే పరిశీలించి రూ.లక్ష సాయం అందించే జాబితాలో చేర్చనున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు స్వయం ఉపాధికై 292 మంది దరఖాస్తు చేసుకోగా, సంబంధిత దరఖాస్తుదారుల్లో అర్హులున్నట్లయితే రూ.లక్ష ఆర్థిక సహాయం అందించనున్నారు.
బీసీ కులవృత్తులు, ఎంబీసీ కులాలకు వారం రోజుల్లోగా ఆర్థిక సాయం అందనున్నది. నియోజకవర్గానికి 300ల మందికి చొప్పున జిల్లావ్యాప్తంగా 1200 మందికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ సాయాన్ని అందజేయనున్నారు. ఇప్పటికే అర్హుల జాబితాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. కులవృత్తులకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే గొల్ల, కురుమలు, మత్స్యకారులు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు ఆర్థిక తోడ్పాటునందించిన బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కుల, చేతివృత్తుల వారి నిమిత్తం కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జూన్ నుంచి బీసీ కుల, చేతివృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. జూన్‌లో జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో కలిపి 20 మంది బీసీ కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. జిల్లావ్యాప్తంగా గత నెల 20 వరకు బీసీ కులవృత్తులు, ఎంబీసీ కులాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకునేందుకుగాను అవకాశమివ్వగా, జిల్లావ్యాప్తంగా 13,157 మంది దరఖాస్తు చేసుకున్నారు.
సంబంధిత దరఖాస్తులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో, మున్సిపాలిటీల్లో కమిషనర్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను చేపట్టి 3141 మందిని అనర్హులుగా గుర్తించి, మరో 9607 మంది అర్హులుగా గుర్తించి ఎంపిక చేశారు. మరో 409 దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉన్నది. సంబంధిత 9607 మంది అర్హుల జాబితాను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి అందజేయగా, మొదటి విడుతగా 3387 యూనిట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేసింది. బీసీ కులవృత్తులకు ఆర్థిక చేయూతకు సంబంధించి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని కుటుంబంలో ఒకరికి మాత్రమే అందజేస్తున్నారు. ఈ పథకానికి 18 ఏండ్ల నుంచి 55 ఏండ్లలోపు వారు మాత్రమే అర్హులని, గ్రామాల్లో 1.50 లక్షలోపు, పట్టణాల్లో రూ.2 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. బీసీ కులవృత్తుల్లో బీసీ కులాల్లోని 14 బీసీ కువృత్తులైన నాయీబ్రాహ్మణులు, రజక, సగర, కుమ్మరి, ఆవుసుల, కంసాలి, వడ్రంగి, వడ్డెర, కమ్మరి, కంచరి, మేదర, కృష్ణ బలిజ పూస, మేర, ఆరె కటిక కులాలతోపాటు ఎంబీసీకి సంబంధించిన 36 కులాలకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది.
Very Big
రంగారెడ్డి జిల్లాలో..
‘పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే బీసీలకు రూ.లక్ష సాయానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్.. మైనార్టీలకూ రూ.లక్ష సాయం అందించేందుకు సంకల్పించారు. విద్య, ఉపాధి తదితర రంగాల్లో మైనార్టీలకు చేయూతనిస్తుండగా, రూ.లక్ష సాయంతో పేదరికాన్ని, వెనుకబాటును సమూలంగా తొలగించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను సైతం జారీ చేసింది. కలెక్టర్ ఆధ్వర్యంలో త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలుకానున్నది.’
దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీల్లో చేతి వృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలో చేతి వృత్తులపై ఆధారపడి వేల మైనార్టీ కుటుంబాలు జీవిస్తున్నాయి. గత ప్రభుత్వాల పాలనలో సరైన ప్రోత్సాహం లేక అనేక వృత్తులు కనుమరుగై మైనార్టీ కుటుంబాలు దీనావస్థలో గడుపుతున్నాయి. స్వరాష్ట్రంలోని వివిధ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పటికే బీసీ కులాల్లోని చేతి వృత్తిదారులకు రూ.లక్ష సాయాన్ని అందించి ఆదుకుంటున్నారు. ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందిన లబ్ధిదారులు తిరిగి సాయం డబ్బులను చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా పూర్తి ఉచితంగా అందిస్తుండడంతో చేతి వృత్తులపై ఆధారపడి బతుకుతున్న మైనార్టీలు తమ చేతి వృత్తులను అభివృద్ధి చేసుకునేందుకు ఈ స్కీం దోహదపడనున్నది.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారికీ సాయం..
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎకనామిక్ సపోర్ట్ పథకం కింద 80 శాతం సబ్సిడీపై రూ.లక్ష యూనిట్‌కు, 70శాతం సబ్సిడీపై రూ.2లక్షల యూనిట్‌కు గత జనవరిలో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారితోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికీ రూ.లక్ష సాయాన్ని అందించనున్నారు. అర్హులైన క్రిస్టియన్లకు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా.. ముస్లిం, సిక్కు, బుద్దిస్ట్, జైన్, పార్శీ మతాలకు చెందినవారికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సాయాన్ని అందిస్తారు. కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి మానిటరింగ్, స్క్రీనింగ్ కమిటీలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే మొదలుపెట్టనున్నది.
విద్య, ఉపాధి రంగాల్లో ఇతోధికంగా చేయూత..
రంగారెడ్డి జిల్లాలోని మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తోంది. జిల్లాలోని 17వేల మైనార్టీ విద్యార్థులకు 2022-23 సంవత్సరంలోనే రూ.47కోట్లను ఉపకార వేతనాల కింద ప్రభుత్వం అందజేసింది. గడచిన తొమ్మిదేండ్లలో రూ.402కోట్లను ఉపకార వేతనాలుగా చెల్లించింది. ముఖ్యమంత్రి ఓవర్సీస్ విద్యానిధి ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 155 మంది విద్యార్థులకు రూ.26.53 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. 9 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 3,760 మందికి, 9 జూనియర్ కళాశాలల్లో 5,200 మందికి కార్పొరేట్ విద్యను ప్రభుత్వం అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 667 మంది లబ్ధిదారులకు రూ.5.40కోట్లను మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 109 మందికి రూ.1.58కోట్లను అందజేసింది. షాదీముబారక్ కింద 3,467 మందికి ఈ ఏడాదిలో రూ.34.71కోట్లను ప్రభుత్వం అందజేసింది. మసీదులు, ఖబరస్థాన్ల కోసం నిధులు వెచ్చించడంతోపాటు, రంజాన్ పండుగ సందర్భంలోనూ కానుకలను అందించి ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేసి మైనార్టీలపై ప్రభుత్వానికి ఉన్న మమకారాన్ని చాటుకుంటున్నది.
Rrr
రూ.లక్ష సాయం అభినందనీయం..
మైనార్టీలకూ బీసీలకు ఇస్తున్నట్లుగా రూ.లక్ష సాయం అందించడం అభినందనీయం. సీఎం కేసీఆర్‌కు మైనార్టీలు రుణపడి ఉంటారు. ఏడాదికి మైనార్టీ సోదరులకు రూ.2200 కోట్లు కేటాయించడం సంతోషదాయకం. పరిగి నియోజకవర్గంలో మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి ధన్యవాదాలు.
– రఫిక్ బొంపల్లి, దోమ మండలం
ఎప్పటికీ గుర్తుంచుకుంటాం..
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించే నిర్ణయం చాలా గొప్పది. ఇది మైనార్టీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనున్నది. స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మైనార్టీల మేలు కోరే సీఎం కేసీఆర్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుని, ఆయన వెంటే ఉంటాం.
– మహ్మద్ రసూల్, రాజీవ్ గృహకల్ప, కుంట్లూరు
మైనార్టీల అభివృద్ధికి సీఎం కృషి..
సీఎం కేసీఆర్ మైనార్టీ బంధు పెట్టడం సంతోషకరం. గ్రామాల్లో మైనార్టీలు ఏదో ఒక పని చేస్తుంటారు. మైనార్టీ బంధు ద్వారా ఆర్థికంగా ఎదుగనున్నారు. ముస్లీంలు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు. మైనార్టీ బంధు ద్వారా నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. జీవనోపాధులు పెంపొందించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– జుబేర్, కో-ఆప్షన్ సభ్యుడు, కులకచర్ల మండలం
సాయం అందించడం అభినందనీయం..
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్నది. అన్ని వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. పేద మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. పేద మైనార్టీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– అలీమోద్దీన్, పెద్దాపూర్, మర్పల్లి
మేమంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం..
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలతో పాటు ముస్లిం, మైనార్టీలకు తగిన గుర్తింపును ఇస్తున్నారు. మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామనడం సంతోషంగా ఉన్నది. ఈ పథకంతో ఎంతో మంది పేదలకు మేలు జరుగనున్నది. సీఎం కేసీఆర్‌కు ముస్లిం, మైనార్టీలు ఎప్పటికి అండగా ఉంటాం.
– రియాజ్, నందిగామ