‘విద్యను మించిన ఆస్తులు లేవు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రంగంలో రాణించాలన్నా విద్యే ప్రధానం.. ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా ఎదుగాలి..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు సూచించారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు గదుల నిర్మాణానికి, మహాదేవుపూర్లో కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపనలు చేయడంతో పాటు అప్పారెడ్డిగూడ గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేజీ టూ పీజీ వరకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకు వేల కోట్ల నిధులను వెచ్చించి విద్యా ప్రమాణాలను పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
షాద్‌నగర్, మే 6 : విద్యను మించిన ఆస్తులు లేవనే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు గ్రహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామంలో రూ.2 కోట్ల నిధులతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని, షాద్‌నగర్ పట్టణంలో రూ. 1.55 కోట్ల నిధులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన, కొందుర్గు మండలం మహాదేవుపూర్ గ్రామంలో రూ.15 లక్షలతో కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలంటే విద్య ప్రధానమని, నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కేజీ టూ పీజీ విద్యను ప్రవేశపెట్టి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేండ్లలో రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి వేల కోట్లను వెచ్చించి విద్యా ప్రమాణాలను పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి తెలిపారు.
పాఠశాలల ఆధునీకరణ
మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని మారుమూల గ్రామాల పాఠశాలలను కూడా ఆధునీకరించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలలను నెలకొల్పామని, సుమారు 1150 గురుకుల కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. దశలవారీగా కేజీ టూ పీజీ విద్యను అమలుచేసే క్రమంలో నూతనంగా డిగ్రీ, పీజీ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో బాలికల విద్యాభ్యాస శాతం పెరిగిందని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయిలో బాలికల శాతం పెరిగిందని, ఈ నేపథ్యంలో మహిళా కళాశాలలు పెరిగాయని వివరించారు. మన రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయంతో పాటు మహిళా పీజీ కళాశాలలను ఏర్పాటుచేసేందుకు సీఎం చర్యలు తీసుకున్నారని మంత్రి తెలిపారు.
అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ‘న్యాక్’
ప్రభుత్వ విద్య ప్రైవేట్‌కు దీటుగా కొనసాగుతున్నదని, వేలాది మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపుతూ ఉన్నత చదువులు చదుతున్నారన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట మహిళా కళాశాల దేశంలోనే రెండో స్థానంలో నిలువడం సంతోషకరమని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కళాశాలల్లో న్యాక్ అర్హత ఉండేలా వసతులను కల్పిస్తామని చెప్పారు. ఒప్పంద అధ్యాపకులను శాశ్వత ఉద్యోగులుగా సీఎం గుర్తించారనే విషయాన్ని గ్రహించాలని కోరారు. విద్యార్థులు పూర్తి ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించాలని, ఏ కార్పొరేట్ సంస్థలోనైనా ఉద్యోగం సాధించేలా సిద్ధం కావాలని మంత్రి సూచించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వ విద్యాసంస్థలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యతో పాటు వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన దృష్టి సారించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన ప్రభుత్వం అదే తరహాలో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును కూడా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో పాటు రైతులకు రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి సబితారెడ్డి తెలిపారు.
మరిన్ని వసతులు కలిస్తాం..
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. షాద్‌నగర్ ప్రాంత విద్యార్థుల కోసం తమ వంతుగా విద్యా బలోపేతానికి కృషిచేస్తున్నామని చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో గురుకుల పాఠశాలలతో పాటు మహిళా గిరిజన డిగ్రీ కళాశాలను ఏర్పాటుచేశామన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరిన్ని వసతులను కల్పించేందుకు నిధులను కేటాయిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్లను కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సన్మానించారు. చెస్ పోటీల్లో ఉత్తమ ప్రతిభను చూపిన మహేశ్వరి అనే విద్యార్థినిని మంత్రి సన్మానించారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్లు మహేశ్వరి, కృష్ణవేణి, జీటీ శ్రీనివాస్, సర్వర్ పాషా, వెంకట్రాంరెడ్డి, ప్రేమలత, నాయకులు నారాయణరెడ్డి, విశ్వం, యుగేందర్, కిశోర్, శేఖర్, నారాయణయాదవ్, రామకృష్ణ, శరత్కృష్ణ, శివ ఉన్నారు.