తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలతో కులవృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నది. కులవృత్తిదారుల అభ్యున్నతే ధ్యేయంగా అనేక చర్యలు తీసుకుంటున్నది. గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెల యూనిట్లను అందిస్తుండగా.. మత్స్యకార కుటుంబాలకు ఏటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేయూతనిస్తున్నది. అంతేకాకుండా రజకులు, నాయీబ్రాహ్మణులకు మేలు చేసేందుకు లాండ్రీ షాపులు, హెయిర్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నది. దీంతో వికారాబాద్ జిల్లాలోని ఎంతోమందికి మేలు జరుగుతున్నది. జిల్లావ్యాప్తంగా 1064 హెయిర్ సెలూన్లు, 1601 లాండ్రీ దుకాణాలకు వర్తింపజేయగా.. ఇప్పటివరకు రూ.5కోట్ల మేర సబ్సిడీని అందించింది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుండడంతో పలువురు కులవృత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
వికారాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : కులవృత్తుల వారు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. పలు కులవృత్తులకు విద్యుత్తు సబ్సిడీని కూడా అమలు చేస్తూ ఆర్థిక చేయూతనందిస్తున్నది. నాయీ బ్రాహ్మణులు, రజకులకు వారివారి కులవృత్తుల్లో భాగంగా విద్యుత్తు సబ్సిడీని అందిస్తున్నది. సంబంధిత కులవృత్తుల్లో విద్యుత్తు వినియోగం తప్పనిసరి కావడంతో సంపాదించిన మొత్తంలో చాలా వరకు విద్యుత్తు బిల్లులకే చెల్లించాల్సి వచ్చేది. నాయీ బ్రాహ్మణులు, రజకుల విజ్ఞప్తులను, ఆర్థిక స్థితిగతులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని విద్యుత్తు సబ్సిడీని అందిస్తూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గత మూడేండ్లుగా మెజార్టీ హెయిర్ సెలూన్లకు సంబంధించిన నాయీ బ్రాహ్మణులు విద్యుత్తు వినియోగిస్తున్నప్పటికీ రూపాయి చెల్లించకుండా కులవృత్తులను నిర్వహిస్తున్నారు. మరోవైపు లాండ్రీ షాపులకు ఎలాంటి విద్యుత్తు బిల్లులు లేకుండానే కులవృత్తిని ప్రోత్సహిస్తున్నారు. 250 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగిస్తున్న హెయిర్ సెలూన్లు, లాండ్రీ షాపులకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండగా, జిల్లాలో ఇప్పటివరకు 1064 హెయిర్ సెలూన్లకు రూ.2 కోట్లు, 1601 లాండ్రీ షాపులకు 3 కోట్ల మేర సబ్సిడీని ప్రభుత్వం అందించింది.
కుల వృత్తులను ప్రోత్సహించడం సంతోషకరం
– నర్సింహులు, కటింగ్ షాపు, వికారాబాద్
చాలా సంవత్సరాలుగా కటింగ్ షాపుపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం. కుల వృత్తుల వారికి గత ప్రభుత్వాలు ఎలాంటి సహాయం చేయలేదు. నెలకు దాదాపు వెయ్యి నుంచి రూ.1200ల వరకు విద్యుత్ బిల్లులు వచ్చేవి. తెలంగాణ ప్రభుత్వం నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం సంతోషంగా ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి కులవృత్తినే నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మాలాంటి వారికి కొండంత ధైర్యాన్ని అందించారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
ఉచిత కరెంట్‌తో కష్టాలు తీరాయి
– నర్సింహులు, శివరాంనగర్ కాలనీ, వికారాబాద్
తాతల కాలం నుంచి వస్తున్న కుల వృత్తిని రజకులమైన మేము కాపాడుకోవాల్సిన అవసరముంది. కాని ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం. ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూస్తుంటే.. ఇటీవల 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో ఆనందంగా ఉంది. మాలాంటి కులవృత్తుల వారికి ఈ అవకాశం ఎంతో ఉపయోగపడుతున్నది. సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే షాపులను కొనసాగిస్తున్నాం. మొత్తంగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
నాయీబ్రాహ్మణులు సీఎంకు రుణపడి ఉంటారు
– మంగలి శ్రీధర్, కాళ్లాపూర్, పరిగి మండలం
నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారు. నాలాంటి కులవృత్తులు చేసుకునేవారికి షాపు కిరాయి, విద్యుత్ బిల్లులు కట్టేందుకే సంపాదించిన డబ్బులు సరిపోయేవి. 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో కరెంటు బిల్లుల మోత తప్పింది.
నాయీబ్రాహ్మణులను గుర్తించింది కేసీఆర్ ప్రభుత్వమే..
– ఎం.రాజు, సెలూన్ షాపు నిర్వాహకుడు, కంకణాలపల్లి
నాయీబ్రాహ్మణులను గుర్తించి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం కేసీఆర్‌దే. గతంలో ఏ ప్రభుత్వమూ నాయీబ్రాహ్మణులను పట్టించుకున్న పాపానపోలేదు. విద్యుత్ బిల్లులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడేవాళ్లం. తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి గత సంవత్సరం నుంచి సెలూన్ షాపులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. కేసీఆర్ సారుకు నాయీబ్రాహ్మణులు రుణపడి ఉంటారు.
ఉచిత విద్యుత్‌తో మేలు కలిగింది
– చాకలి శ్రీనివాస్, బొంరాస్‌పేట
సర్కారు ఇస్త్రీ దుకాణాలకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్నందించి ఆదుకుంటున్నది. నెలకు వంద యూనిట్ల వరకు విద్యుత్ వినియోగిస్తున్నాం. ఏడాది నుంచి కరెంటుబిల్లు కట్టడంలేదు. మాలాంటి పేదవారికి మేలు కలిగింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పథకాలు
– మంగలి రాజు, మర్పల్లి
దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతున్నది. సీఎం కేసీఆర్ మమ్మల్ని గుర్తించి గతేడాది నుంచి సెలూన్ షాపులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. గతంలో పాలించిన ప్రభుత్వాలు విధ్యత్ సరిగ్గా ఇవ్వకుండే, ఇప్పుడు తెలంగాణ సర్కారు 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నది. సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
ఆపద్బాంధవుడు కేసీఆర్
– చాకలి గోపాల్, ఇస్త్రీ షాపు నిర్వాహకుడు, కోట్‌పల్లి
కులవృత్తులను కేసీఆర్ సారు ఆదుకుంటూ మాకు దేవుడయ్యాడు. కోట్‌పల్లిలో ఇస్త్రీ షాపు పెట్టుకుని కుటుంబాన్ని సాగిస్తున్నా.. మొదట్లో బొగ్గుల ఇస్త్రీ పెట్టె ఉండేది. బొగ్గులు దొరకక నానా ఇబ్బంది పడేది. సగం రోజులు షాపును బంద్ చేస్తుంటి. సీఎం కేసీఆర్ సారు గుర్తించి మాకు ఫ్రీ కరెంటు ఇవ్వడంతో కరెంటు ఇస్త్రీ పెట్టెను తెచ్చుకున్న.
కులవృత్తిని నమ్ముకొని ఐరన్ చేస్తున్నా
– ప్రభాకర్, గరీబ్‌నగర్, వికారాబాద్
కుల వృత్తిని నమ్ముకుని ఐరన్ చేస్తున్నా. సీఎం కేసీఆర్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడంతో కులవృత్తిని గర్వంగా కాపాడుకుంటున్నాం.
ఎంతో మేలు జరుగుతున్నది..
ప్రభుత్వం నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం గొప్ప విషయం. గతంలో విద్యుత్ బిల్లులు దాదాపు రూ.2వేల వరకు వచ్చేవి. ప్రతి నెలా విద్యుత్ బిల్లులు కట్టలేక ఇబ్బందులకు గురయ్యేవాళ్లం. షాపుల అద్దెలు కూడా పెరగడంతో కుటుంబ అవసరాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించడంతో నా లాంటి వారికి ఎంతో మేలు జరుగుతున్నది.
– శ్రీనివాస్, కటింగ్ షాపు, వికారాబాద్