యాచారం, జూన్ 2 : మండలంలోని తాటిపర్తి గ్రామంలో జరుగుతున్న ఫార్మా పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. ఫార్మా భూముల్లో చదును చేసేందుకు గ్రామానికి పదుల సంఖ్యలో వచ్చిన జేసీబీలు, డ్రోజర్లను అడ్డుకొని కోర్టు స్టే ఉన్న భూముల్లో ఎలాంటి పనులు చేయొద్దని వెనక్కి పంపారు. గ్రామానికి చెందిన చిట్టి నాగమణి అనే మహిళా రైతు ఫార్మాకు భూమిని ఇవ్వలేదు. సర్కార్ నుంచి పరిహారమూ తీసుకోలేదు. అయినా టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆర్డీవో అనంతరెడ్డి ఆదేశాలతో పోలీసుల సహకారంతో బలవంతంగా ఆ భూమిలో చదును చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికెళ్లి జేసీబీలు, డ్రోజర్లు రైతుల పొలాలకు రాకుండా అడ్డుకున్నారు.
ఫార్మాసిటీ ఠాణా ఎస్ఐ సైదులు, సునీల్‌కుమార్‌తోపాటు ఆర్ఐ మురళీకృష్ణ రైతులకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఏదైనా సమస్య ఉంటే నానక్‌నగర్ క్యాంపు వద్ద మాట్లాడుకుందాం అని చెప్పడంతో ఎక్కడికి వచ్చేదిలేదని మీరే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని రైతులు అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. కోర్టు స్టే ఉన్న భూముల్లో కి ఎలా వస్తారంటూ రైతులు అధికారులను ప్రశ్నించారు.
ఫార్మాసిటీకి ఇవ్వని భూముల్లోకి అధికారులు బలవంతంగా యంత్రాలను తీసుకొచ్చి చదును చేయించడం ఎంతవరకు సమంజసమని వారు మం డిపడ్డారు. పంచాయతీ అనుమతుల్లేకుండా ఎలాం టి వాహనాలు, యంత్రాలు రైతుల భూముల్లోకి తీసుకురావొద్దని అధికారులను హెచ్చరించారు. భూములను చదును చేసేందుకు పదుల సంఖ్యలో వచ్చిన జేసీబీలు, డ్రోజర్లను గ్రామానికి అనుబంధం గా ఉన్న గొల్లగూడ గ్రామం వద్ద రైతులు, గ్రామస్తు లు అడ్డుకొని వాటిని వెనక్కి పంపారు. ఇంకోసారి భూములను చదును చేసేందుకు జేసీబీలతో వస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. దీంతో చేసేదేమీలేక అధికారులు, పోలీసులు తాటిపర్తి గ్రామం నుంచి వెనుదిరిగిపోయారు.

ప్రభుత్వం రియల్ వ్యాపారం చేస్తున్నది..
ఈ సందర్భంగా ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త సరస్వతి తాటిపర్తి గ్రామానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. కోర్టు స్టే ఉన్న భూ ముల్లోకి అధికారులు ఎలా వస్తారని మండిపడ్డా రు. మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రా మాల రైతులకు చెందిన ఫార్మాకు ఇవ్వని 2,250 ఎకరాల భూముల్లోకి వచ్చే అధికారం వారికి లేదన్నారు. ఆర్డీవో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఫార్మాకు ఇవ్వని భూముల్లోకి అక్రమంగా చొరబడి భూములను చదును చేయ డం, కరెంట్‌ను నిలిపివేయడం చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.
ఫ్యూచర్‌సిటీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ వ్యాపా రం చేస్తున్నదని, మండలంలో కాలుష్య కంపెనీలను ఏర్పాటు చేస్తే అని గ్రామాలు ఆగమైపోతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మన భూ ములు, మన గ్రామాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తూ.. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్న అధికారులు, పోలీసులపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని.. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.