రంగారెడ్డి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : దేవుడు వరమిచ్చినా… పూజారి అనుగ్రహించడన్న చందంగా మారింది జిల్లా మత్స్యకారుల పరిస్థితి. ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురియగా చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. ఈ పరిస్థితిలో అన్ని చెరువుల్లో చేప పిల్లలను వదలాల్సిన మత్స్యశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికీ చేపపిల్లల పంపిణీకి సంబంధించి టెండర్లు నిర్ణయించకపోవడం గమనార్హం.
జిల్లాలోని ఇబ్రహీంపట్నం పెద్దచెరువు, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్చెరువు, మహేశ్వరం మండలంలోని రావిర్యాల పెద్ద చెరువుల్లో ఇప్పటికీ చేపపిల్లలను వదలకపోవటంతో మత్స్యకారులు అసంతృప్తికి లోనవుతున్నారు. జూన్, జూలై నెలల్లోనే అన్ని చెరువుల్లో చేపపిల్లలను వదలాల్సి ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసి వారు ఆర్థికంగా ఎదిగేందుకు మాజీ ముఖ్యమం త్రి కేసీఆర్ ఎంతో దోహదపడ్డారు. సకాలం లో చేపపిల్లలను అందించడంతో మత్స్యకారులు చేపలను పెంచి.. వాటిని విక్రయించి ఉపాధి పొందారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండడంతో మత్స్య కారులు రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నది.
జిల్లాలో 1,117 చెరువులు, కుంటలు
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో చిన్న, పెద్ద చెరువులు, కుంటలు అన్ని కలిపి 1,117 ఉన్నాయి. ఈ చెరువుల పరిధిలో 208 సొసైటీలుండగా.. అందులో 10,128 మంది సభ్యులున్నారు. కాగా, ప్రభుత్వం సకాలంలో చేపపిల్లలను చెరువుల్లో వదలకపోవడంతో ము న్ముందు చేపల కొరత ఏర్పడే అవకాశముందని మత్స్యకారులు వాపోతున్నారు. గతంలో వదిలిన చేపలను పట్టుకుని జీవిస్తున్నామని.. ఇప్పటికీ చేపలను చెరువుల్లో వదలకపోవడంతో తమకు ఉపాధి కరువవుతుందని.. పనికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టార్గెట్ 2 కోట్లు, ఇచ్చింది 58 లక్షలే..
జిల్లాలో ఉన్న చెరువులు, కుంటల్లో ఈ ఏడాది 2 కోట్ల చేప పిల్లలను వదలాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత జూన్, జూలై నెలల్లోనే వాటిని పంపిణీ చేయాల్సి ఉండగా.. వాటికి సంబంధించిన టెండర్లు ఖరారు కాకపోవడంతో రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో 58 లక్షల చేప పిల్లలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి షాద్నగర్ నియోజకవర్గంలోపాటు పలు ప్రాంతాల్లో పంపిణీ చేశారు. మిగతా 1,42,00,000 చేప పిల్లలు ఎప్పుడు ఇస్తారన్నది ప్రశ్నగా మారింది. ఈ పరిస్థితిలో తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మత్స్యకారులు వాపోతున్నారు.
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు చేరని చేపలు
జిల్లాలోనే అతి పెద్దదైన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నీటితో కళకళలాడుతున్నది. ఈ చెరువులో 8.80 లక్షల చేప పిల్లలను గత జూన్, జూలై నెలల్లోనే వదలాల్సి ఉన్నా.. ఇప్పటికీ వదలకపోవడంతో తమ బతుకులు రోడ్డున పడుతాయని.. తమకు ఉపాధి కరువవుతుందని వందలాది మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇబ్రహీంపట్నంతోపాటు జిల్లాలోని పలు చెరువుల పరిస్థితి కూడా ఇదే తరహాలోనే ఉన్నది. వెంటనే మత్స్యశాఖ అధికారులు జోక్యం చేసుకుని సకాలంలో చేప పిల్లలను పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు.
మత్స్యకారులను పట్టించుకోని సర్కార్
గత కేసీఆర్ హయాంలో ప్రతి ఏటా చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదిలేవారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపపిల్లల పంపిణీ ప్రహసనంలా మారింది. చెరువు లు, కుంటల్లో సమృద్ధిగా నీరున్నా వదలడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. చేప పిల్లలను చెరువుల్లో వదల కపోవడంతో తమకు ఉపాధి కరువవుతుంది. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి వస్తుంది.
-సురేశ్, మత్స్యకారుడు , గూడూరు
చలి కాలంలో చేప పిల్లలు బతకవు..
ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన ప్రకారం చేప పిల్లలను పంపిణీ చేయాలి. కానీ, ఇప్పటికీ కేవలం 58 లక్షల పిల్లలను మాత్రమే పంపిణీ చేసి చేతులెత్తేశారు. మిగతా చేప పిల్లలను డిసెంబర్లో పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ, డిసెంబర్లో చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశమున్నందున చెరువుల్లో చేప పిల్లలు వదిలినా బతికే అవకాశముండదు.
-గుంటి భీంరావు