రాష్ట్ర బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లా ప్రజానీకం హర్షం
అన్ని రంగాలకు సముచితస్థానం..
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు మేలు జరిగేలా నిధుల కేటాయింపు
ఏడాదిలోగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
సొంత జాగుంటే రూ.3లక్షల ఆర్థికసాయం..
తొలుత ఒక్కో నియోజవర్గానికి 3వేల మందికి..
ఉమ్మడి జిల్లాలో 33వేల మందికి లబ్ధి
ఈ ఏడాది నుంచే 57 ఏండ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు
రంగారెడ్డి, మార్చి 7, (నమస్తే తెలంగాణ)/పరిగి, మార్చి 7 :2022-23 రాష్ట్ర బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. వ్యవసాయం, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తూనే అన్ని రంగాలకు నిధుల కేటాయింపులో సముచితస్థానం కల్పించడాన్ని కొనియాడుతున్నారు. కాగా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎంతో మేలు జరుగనున్నది. రంగారెడ్డి, వికారాబాద్‌తోపాటు నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేసే దిశగా నిధులు కేటాయించారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే రంగారెడ్డి జిల్లాలో 3,59,046 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 3,41,952 ఎకరాలకు సాగు నీరందనున్నది. రెండు జిల్లాల్లోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే సొంత జాగున్నవారు ఇండ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయనుండగా మొదటి విడుతలో ఒక్కో నియోజకవర్గానికి 3 వేల లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించింది. ఈ లెక్కన రెండు జిల్లాల్లో 33 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. ఈ ఏడాది నుంచే 57 ఏండ్లు నిండినవారికి ఆసరా పింఛన్లు ఇవ్వనుండగా.. రంగారెడ్డి జిల్లాలో 31,947 మంది, వికారాబాద్ జిల్లాలో 22వేలకు పైగా మంది లబ్ధిపొందనున్నారు. ఇవేకాకుండా మన ఊరు-మనబడి, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్‌కిట్ తదితర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. గర్భిణులు, బాలింతలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి వికారాబాద్ జిల్లాను ఎంపిక చేశారు. అలాగే జిల్లాలో ఈసారి 6వేల మందికి దళితబంధు అందనున్నది.
రాష్ట్ర బడ్జెట్లో సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రతీ బడ్జెట్ మాదిరిగానే ఈ బడ్జెట్లోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాను యథావిధిగా కొనసాగించేందుకు నిధులు కేటాయించింది. దళితబంధు, మన ఊరు-మన బడి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్స్, ఆరోగ్య శ్రీ, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి పథకాలకు నిధుల కొరత రాకుండా బడ్జెట్లో కేటాయింపులు చేసింది. మరోవైపు 57 ఏండ్లు నిండిన వారికీ వచ్చే ఆర్థిక సంవత్సరం పింఛన్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
త్వరలో పాలమూరు ప్రాజెక్టు పనులు షురూ…
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే రూ.1360 కోట్లను కేటాయించింది. గతేడాది రూ.10 వేల కోట్ల రుణాలను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పొందేందుకుగాను ప్రభుత్వం అనుమతులను కూడా మంజూరు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ నుంచి రూ.8 వేల కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లాకు సాగు నీరందించేందుకుగాను లక్ష్మీదేవిపల్లి వద్ద పనులు స్పీడందుకున్నాయి. రంగారెడ్డి జిల్లాతోపాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, నల్లగొండ జిల్లాలకు సాగు నీరందనున్నది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటిని పంపింగ్ చేయనున్నారు. తొలుత శ్రీశైలం నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలోని నార్లపూర్ రిజర్వాయర్‌కు తదనంతరం నాగర్‌కర్నూల్ జిల్లాలోని వట్టెం రిజర్వాయర్‌కు, ఆ తర్వాత వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయనున్నారు. తదనంతరం మహబూబ్‌నగర్ జిల్లాలోని కరివెన రిజర్వాయర్‌కు అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉద్దండపూర్ రిజర్వాయర్‌కు చివరగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయనున్నారు. లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నుంచి జిల్లాకు సాగునీటిని అందించనున్నారు. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తైతే జిల్లాలోని 3,59,046 ఎకరాలకు సాగునీరు అందనున్నది.
జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ..
జిల్లా ప్రజలకు శుభవార్త. పేదలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రెండేండ్లలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో వచ్చే ఏడాది ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసేందుకుగాను ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
సొంత జాగుంటే రూ.3 లక్షలు..
డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి సొంత స్థలం ఉన్నవారికి రూ.3 లక్షల సాయాన్ని ప్రభుత్వం అందించనున్నది. మొదటి విడుతలో ఒక్కో నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల చొప్పున కేటాయించింది. జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో 21 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూం ఇండ్లకు 2.11 లక్షల దరఖాస్తులు అందినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2637 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. జిల్లాలో పూర్తైన ఇండ్లలో 1880 ఇండ్లు షాద్‌నగర్ నియోజకవర్గానికి సంబంధించినవి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 335 ఇండ్లు, మహేశ్వరం నియోజకవర్గంలో 192 ఇండ్లు, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 130 ఇండ్లు, చేవెళ్ల నియోజకవర్గంలో 100 ఇండ్ల నిర్మాణం పూర్తైంది. జిల్లాకు 6777 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, చేవెళ్ల నియోజకవర్గానికి 1060 ఇండ్లు, కల్వకుర్తికి 738 ఇండ్లు, ఇబ్రహీంపట్నం 1239 ఇండ్లు, షాద్‌నగర్ నియోజకవర్గానికి 3100 ఇండ్లు, రాజేంద్రనగర్‌కు 240, మహేశ్వరం నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. అయితే 6383 ఇండ్లకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి.
రూ.75 వేల లోపు పంట రుణాలు మాఫీ…
జిల్లా రైతాంగానికి శుభవార్త. రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు, రుణమాఫీ పథకాలను అమలు చేస్తున్నది. నాలుగు విడుతల్లో రూ.లక్షలోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రెండో దఫా రుణమాఫీ ప్రక్రియలోనూ ఇప్పటికే రూ.50 వేల లోపు పంట రుణాలను మాఫీ చేయగా, వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.75 వేల లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయించింది. రూ.75 వేల లోపు రుణమాఫీతో జిల్లాలోని 34 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది.
మన ఊరు-మన బడికి ప్రాధాన్యత…
మన ఊరు-మన బడికి తొలి విడుతగా వచ్చే విద్యా సంవత్సరం 33 శాతం స్కూళ్లను ఎంపిక చేయగా, మరో రెండేళ్లలో మిగతా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక సదుపాయాలను కల్పించనున్నారు. జిల్లావ్యాప్తంగా 1338 స్కూళ్లుండగా తొలి విడుతలో 464 స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో ప్రాథమిక పాఠశాలలు-261, ప్రాథమికోన్నత పాఠశాలలు- 58, ఉన్నత పాఠశాలలు- 145 పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో 30 శాతం మేర స్కూళ్లను ఎంపిక చేశారు.
త్వరలో 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు…
57 ఏళ్లు నిండిన వారు జిల్లాలో 31,947 మంది ఉన్నట్లు సంబంధిత అధికారులు లెక్కతేల్చారు. మరో రూ.6 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడనున్నది. వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు, చేనేత, బీడీ కార్మికులకు ప్రస్తుతం పంపిణీ చేస్తున్న రూ.1000ల పింఛన్‌ను రూ.2016లకు, వికలాంగులకు పంపిణీ చేస్తున్న రూ.1500ల పింఛన్‌ను రూ.3016ల పింఛన్‌ను రెండేళ్ల నుంచి అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆసరా పింఛన్‌దారులు మొత్తం 1,63,407 మంది ఉండగా వృద్ధాప్య పింఛన్‌దారులు-52,584, వితంతువులు-76,133, వికలాంగులు-26,000, చేనేత కార్మికులు-755, బీడీ కార్మికులు- 16 మంది, కల్లుగీత కార్మికులు-2000, ఒంటరి మహిళలు 5919 మంది ఉన్నారు. రైతుబీమాతోపాటు చేనేత కార్మికులకూ రూ.5 లక్షల బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది.
ప్రజా సంక్షేమ బడ్జెట్..
ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్. బంగారు తెలంగాణే సీఎం కేసీఆర్ ఆకాంక్ష. దళితుల ఆత్మగౌరవాన్ని పెంచేలా దళిత బంధు, ఆరోగ్యశ్రీ పెంపు, పల్లె, పట్టణ ప్రగతి, మన ఊరు-మన బడితో గ్రామీణ ప్రాంతాలకు బంగారు బాట ఏర్పడింది. నియోకవర్గానికి 3వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేయడం సంతోషకరం. అన్ని వర్గాల సంక్షేమానికి నిధులు మంజూరు చేయడం సీఎం కేసీఆర్‌కే సాధ్యపడింది.
– పట్నం నరేందర్‌రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే
వ్యవసాయ రంగం బలోపేతం..
వ్యవసాయ రంగం బలోపేతం కోసం బడ్జెట్లో రూ.24వేల కోట్లు కేటాయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీతతో పూర్వ వైభవం వచ్చింది. రైతును రాజు చేసేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.
– గంప వెంకటేశ్, సింగిల్ విండో చైర్మన్,ఆమనగల్లు
రాష్ట్ర బడ్జెట్లో వికారాబాద్ జిల్లాకు అనేక వరాలు ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలతోపాటు అదనంగా సొంతింటి కల నెరవేర్చేలా రూ.3లక్షలు అందజేసే పథకాన్ని ప్రకటించింది. దళితబంధుకు రూ.17.700కోట్లు కేటాయించడం ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఈసారి సుమారు 1500 మందికి తగ్గకుండా లబ్ది చేకూరనుంది. 57 ఏళ్లు నిండినవారికి పింఛన్ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అదనంగా 22వేల మంది పైచిలుకు లబ్ధిదారులకు పింఛన్ అందనున్నది. వికారాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయబడింది. జిల్లాలోని గర్భిణులు, బాలింతలకు న్యూట్రిషన్ కిట్లు అందించేందుకు వికారాబాద్ జిల్లా ఎంపిక చేయబడింది. పాలమూర్-రంగారెడ్డి పథకాన్ని తప్పనిసరిగా పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతోపాటు ఈసారి వికారాబాద్ జిల్లా పరిధిలో పాలమూర్ ఎత్తిపోతల పనులకు సంబంధించిన టెండర్లు పిలుస్తామని బడ్జెట్లో పేర్కొనడం ద్వారా ఈ ప్రాంత రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా విద్యార్థులకు అందుబాటులోకి వైద్య విద్య..
వికారాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లా వాసులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే టీహబ్ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తుండగా మెడికల్ కళాశాలతో జిల్లా ప్రజలకు మరిన్ని సేవలు అందనున్నాయి.
గర్భిణులు, బాలింతలకు‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ల పంపిణీకి జిల్లా ఎంపిక..
రాష్ట్రంలో గర్భిణులలో, బాలింతలలో రక్తహీనత సమస్య అధికంగా ఉన్న జిల్లాల్లో వికారాబాద్ జిల్లా సైతం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ లోపాన్ని పూర్తిస్థాయిలో నివారించేందుకు ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ల పేరుతో త్వరలో కిట్లు అందించేందుకు సర్కారు ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలో ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందించేందుకు నిర్ణయించగా అందులో వికారాబాద్ జిల్లా సైతం ఉన్నది. తద్వారా వికారాబాద్ జిల్లా పరిధిలో గర్భిణులు 5639 మంది, బాలింతలు 3348 మంది ఉన్నారు. జిల్లా పరిధిలోని వారికి త్వరలోనే ఈ కిట్లు అందనున్నాయి. దీంతో వారిలో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు ఈ కిట్లు దోహదం చేస్తాయని చెప్పవచ్చు.
పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతలతో జిల్లాలో 3,41,952 ఎకరాలకు సాగునీరు
జిల్లా పరిధిలో పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు సంబంధించిన టెండర్లు నిర్వహించి పనులు చేపడతామని బడ్జెట్లో పేర్కొన్నారు. పనులు పూర్తయితే వికారాబాద్ జిల్లా పరిధిలోని 417 గ్రామాల పరిధిలో 3,41,952 ఎకరాలకు సాగునీరు అందనున్నది.
ఇంటి నిర్మాణంలో జిల్లాలోని 12వేల మందికి లబ్ధి..
స్థలం ఉన్నవారు ఇంటి నిర్మాణం చేసుకునేందుకు రూ.3లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు నిర్ణయించింది. నియోజకవర్గానికి 3వేల ఇండ్ల నిర్మాణానికి సాయం అందనున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో సుమారు 12వేల మందికి లబ్ధి చేకూరనున్నదని చెప్పవచ్చు.
దళితబంధు కింద సుమారు 6వేల మందికి లబ్ది
ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రూ.10లక్షలు గ్రాంటుగా అందజేసి దళితుల జీవితాలలో వెలుగులు నింపే బృహత్తర కార్యక్రమం దళితబంధు అమలుకు సర్కారు చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. జిల్లాలో సుమారు 6వేల మందికి దళితబంధు కింద లబ్ధి చేకూరుతుందని చెప్పవచ్చు.
తండాల్లోని పంచాయతీలకు భవనాలు,రోడ్లు, ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం
గిరిజన, ఆదివాసీ ప్రత్యేక గ్రామపంచాయతీల కార్యాలయాల భవనాల నిర్మాణానికి రూ.600 కోట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రదిపాదించింది. వికారాబాద్ జిల్లా పరిధిలో వందశాతం ఎస్టీలు గల గ్రామపంచాయతీలు 84 ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో గిరిజన, ఆదివాసీ గ్రామపంచాయతీ భవనాలకు ఒక్కోదానికి రూ.25లక్షల చొప్పున మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో సుమారు 30వేల ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగుకు ఉద్యానవన శాఖ అధికారులు నిర్ణయించారు. వికారాబాద్ జిల్లా పరిధిలో రూ.25వేల నుంచి రూ.50వేల లోపు రుణాలకు సంబంధించి 27,628 మందికి రూ.92.5కోట్లు పంట రుణాలు మాఫీ కానున్నాయి.
ప్రజా సంక్షేమానికి పెద్దపీట..
తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. రాష్ట్ర బడ్జెట్లో రూ.2.56 లక్షల కోట్లు కేటాయించడం గొప్ప విషయం. ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల సాయం అందిస్తామనడం సంతోషకరం. దళితబంధుతో వారి జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి.
– పోనుగోటి అర్జున్‌రావు, టీఆర్ఎస్ ఆమనగల్లు మండల అధ్యక్షుడు
అందరికీ ఆమోదయోగ్యంగా..
రాష్ట్ర బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సొంత స్థలాలు ఉన్న పేదలకు ఇండ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున కేటాయించడం చాలా ఆనందం. దళిత బంధుకు రూ.17వేల కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయం.
– మెతుకు ఆనంద్,టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే
ఇక రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలమే..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం సంతోషకరం. ఇక రంగారెడ్డిజిల్లా ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారనున్నది. ఆది నుంచి మొండిచేయి చూపుతున్న కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు.
– ఏనుగు బుచ్చిరెడ్డి, తుర్కగూడ (ఇబ్రహీంపట్నం)