మర్పల్లి, అక్టోబర్ 28 : మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో మంగళవారం అల్పాహారం అందక విద్యార్థులు పస్తులతో పాఠశాలలకు వెళ్లారు. ఈ వసతి గృహంలో సుమారు 45 మంది విద్యార్థులు ఉంటూ పలు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. మంగళవారం ఉదయం పాఠశాలలకెళ్లేందుకు రెడీ అయ్యారు. గత రాత్రి వంట మనిషి మందు తాగి నిద్రలో ఉన్నాడు. బడులకెళ్లేందుకు సమయం అవుతున్నదని అతడిని తట్టిలేపగా..ఇప్పుడే అల్పాహారాన్ని రెడీ చేస్తానని హడావుడి చేశాడు.
అప్పటికే ఉదయం 9 కావడంతో పాఠశాలలకు సమయం అయ్యిందని, పరీక్షలు ఉన్నాయని ఆలస్యంగా వెళ్తే ఉపాధ్యాయులు కోపగిస్తారని విద్యార్థులు ఖాళీ కడుపుతోనే వెళ్లిపోయారు. అక్కడ హాస్టల్ వార్డెన్ ఉండకపోవడంతో వంటమనిషి అప్పుడప్పుడు మద్యం తాగుండడంతో తాము ఉదయం పూట పస్తులుండాల్సి వస్తున్నదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని మెనూ ప్రకారం భోజనం వడ్డించేలా చూడాలని కోరారు.