వికారాబాద్, ఏప్రిల్ 1 : వివాదాలకు నిలయంగా వికారాబాద్ కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల మారింది. గురుకుల పాఠశాలల్లో చక్కటి విద్యాబోధన అందిస్తారనే ఆశతో వచ్చిన విద్యార్థినులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గురుకుల పాఠశాలలో చదువుకొని గొప్ప స్థాయికి చేరుకోవాలనే ఆలోచనతో ఉన్న విద్యార్థులకు దినదిన గండంగా మారింది. ఈ పాఠశాలలో జరిగిన సంఘటనలు ఆలస్యంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఇటీవల 10వ తరగత విద్యార్థినిని టీచర్ తిట్టడంతో మనోవేదనకు గురై పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మాహత్యాయత్నం చేసుకున్నది. విద్యార్థుల పట్ల దురుసు ప్రవర్తనను మానుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ హెచ్చరించారు. మరికొన్ని రోజుల తరువాత విద్యార్థినులపై దుర్భాషలాడుతూ.. ప్రిన్సిపాల్ చెంపదెబ్బలు కొట్టి అవమానపరిచారు.
గత నెలలో బాలుర పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని టీచర్ కొట్టడంతోపాటు తోటి విద్యార్థులతో కొట్టించింది. దీంతో విద్యార్థికి జ్వరం రావడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇంటికి పంపించారు. టీచర్ కొట్టి.. విద్యార్థులతో కొట్టించిందని విద్యార్థి చెప్పడంతో బాలుర గురుకుల పాఠశాల తీరుపై తల్లిదండ్రులు మండిపడ్డారు. చైల్డ్‌లైన్, పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ హామీతో సమస్య సద్దుమణిగింది.
వేధించడంతో ఆత్మహత్యాయత్నం
వికారాబాద్‌లోని కొత్తగడి గురుకుల పాఠశాలలో ఫిబ్రవరి 24న 10వ తరగతి విద్యార్థిని తబిత చదువులో ముందంజలో ఉండేది. తబిత మంచి అమ్మాయి కాదని స్రవంతి టీచర్ తరచూ వేధించడంతో మనోవేదనకు గురై పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ప్రమాదంలో తబితకు ఎడమ కాలు విరిగింది. దీంతో పాఠశాల సిబ్బందితో ఎవరికీ తెలియకుండా ప్రైవేటు వాహనంలో ప్రైవేటు దవాఖానకు తరలించారు.
కొంతసేపటికి తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. తబితకు కాలు విరగడంతో సిమెంట్ పట్టీ వేశారు. విద్యార్థినితో కలిసి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి టీచర్లను నిలదీశారు. విద్యార్థి సంఘాలు పాఠశాల నిర్వాకంపై నిరసనలు వ్యక్తం చేశాయి. విద్యార్థినిని వేధించిన స్రవంతి టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
ఇలాంటి సంఘటనలు మరోసారి జరిగితే కఠిన చర్యలు
విద్యార్థినిని వేధించిన విషయమై స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు తెలియడంతో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్‌ను పంపించగా విద్యార్థినులతో మాట్లాడారు. జరిగిన విషయాన్ని తెలుసుకొని గాయపడ్డ విద్యార్థినికి మనోధైర్యం చెప్పారు. స్పీకర్‌కు ఫోన్ ద్వారా విద్యార్థినితో మాట్లాడించగా.. టీచర్లు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అనేకసార్లు తిడుతూ అవమానపరిచారని తెలిపింది. వెంటనే స్రవంతి మేడంను సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరింది. అనంతరం టీచర్, ప్రిన్సిపాళ్లతో స్పీకర్ మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు మరోసారి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్పీకర్ హెచ్చరించినా..
స్పీకర్ హెచ్చరించిన కొన్ని రోజులకే విద్యార్థినుల పట్ల ప్రిన్సిపాల్ దుర్భాషలాడుతూ కొట్టి అవమానపరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వికారాబాద్‌లోని కొత్తగడి బాలికల గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ సాయిలత ముగ్గురు విద్యార్థినుల మనస్సు గాయపరిచేలా దుర్భాషలాడుతూ వేధించింది. చెంపదెబ్బలు కొట్టింది. అంతేకాకుండా ఓ విద్యార్థిని తల్లిని కూడా బూతులు తిట్టడంతో.. అలా అనవద్దని వేడుకుంటే.. ఎందుకు అనకూడదని పైశాచికంగా ప్రవర్తించింది. మీరు కూలి పనులు చేసుకొని బతుకుతారని అవమానపరిచింది. స్పీకర్ ఆదేశాలను కొత్తగడి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బేఖాతరు చేసిందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
తాను కొట్టి.. తోటి విద్యార్థులతో కొట్టించి..
వికారాబాద్ అనంతగిరిపల్లి సమీపంలో ఉన్న శివారెడ్డిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలో టీచర్ 6వ తరగతి విద్యార్థి యువరాజ్‌ను కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థులతో కొట్టించి బూతులు తిట్టింది. మార్చి 13న బాబుకు ఆరోగ్యం బాగాలేదు ఇంటికి తీసుకెళ్లాలని టీచర్ చెప్పింది. బాబును తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు రాగా.. మ్యాథ్స్ టీచర్ తనను కొట్టడమేగాక.. తోటి విద్యార్థులతో కొట్టించిందన్నాడు.
ఈ టీచర్ వద్దు.. లేకుంటే తాను స్కూల్‌కు వెళ్లనని స్పష్టం చేశాడు. ఈ విషయమై తల్లిదండ్రులు సంబంధిత టీచర్‌ను ప్రశ్నించగా.. తను చేసిన తప్పును ఒప్పుకొన్నది. అప్పటికే తల్లిదండ్రులు ఈ విషయమై సీడబ్ల్యూసీ చైల్డ్‌లైన్‌కు, స్థానిక పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విద్యార్థి పట్ల దురుసుగా ప్రవర్తించిన టీచర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ తల్లిదండ్రులను, బాబును సముదాయించే ప్రయత్నం చేశారు.
చివరకు పోలీస్ స్టేషన్లో ఒప్పందం కుదిరింది. మరోసారి ఇలాంటివి చేస్తే టీచర్‌పై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు. బాబును సముదాయించి, కౌన్సెలింగ్ నిర్వహించి వారం తరువాత పాఠశాలకు తీసుకరావాలని తల్లిదండ్రులకు తెలిపారు. ఇక నుంచి బాబుకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తాను చూసుకుంటానని ప్రిన్సిపాల్ భరోసా కల్పించారు.