సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు జిమ్ నిర్వాహకులు యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దేహదారుఢ్యం కోసం వచ్చే వారికి స్టెరాయిడ్‌తో కూడిన రక్తపోటు పెంచే ఇంజక్షన్లు సరఫరా చేస్తున్నారు. వీటిని ఉపయోగిస్తే.. ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగడమే కాకుండా కొన్ని సార్లు ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదం ఉన్నట్లు డీసీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు.
సికింద్రాబాద్‌లోని పలు జిమ్ సెంటర్లపై పోలీసులతో డీసీఏ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఓ జిమ్ నిర్వాహకుడిని.. అరెస్టు చేసి.. అతడి వద్ద నుంచి మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ డీజీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం…సికింద్రాబాద్‌లోని తాడ్బంద్కు చెందిన ఎండీ ఖాసీం స్థానికంగా జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే తన వద్ద జిమ్‌కు వచ్చే వారికి త్వరగా దేహదారుఢ్యం వృద్ధి చెందడానికి నిబంధనలకు విరుద్ధంగా ‘మెఫెంటర్మైన్ సల్ఫేట్’ ఇంజక్షన్లను విక్రయిస్తున్నాడు.
సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు సికింద్రాబాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గోవింద్‌సింగ్, మలక్‌పేట డ్రగ్ ఇన్స్పెక్టర్ అనిల్ బృందం, మార్కెట్ పోలీసులతో కలిసి గురువారం ఖాసీంకు చెందిన జిమ్సెంటర్పై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఖాసీంను అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ.3వేల విలువ చేసే మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఐదేండ్ల జైలు శిక్ష : డీసీపీ డీజీ కమలాసన్‌రెడ్డి
దేహదారుఢ్యం కోసం వినియోగించే మెఫెంటర్మైన్ సల్ఫేట్ వంటి ఇంజక్షన్లు తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయి. సాధారణంగా శస్త్రచికిత్సల సమయంలో రక్తపోటును పెంచేందుకు వీటిని రోగికి ఇస్తారు. సర్జరీ చేసే సమయంలో వెన్నెముకకు మత్తు ఇంజక్షన్ ఇచ్చినప్పుడు కొందరిలో రక్తపోటు పడిపోతుంది. అలాంటి సమయంలో రక్తపోటును పెంచేందుకు మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు ఇస్తారు. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా తగిన మోతాదులో ఈ ఔషధం ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ ఇలాంటి ఇంజక్షన్లను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్కౌట్లు చేసి..దేహ దారుఢ్యాన్ని పెంచేందుకు ఈ ఔషధాలను విక్రయిస్తున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడటమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి ఔషధాలను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఎవరైనా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలు విక్రయించినా, నిల్వ చేసినా.. ఐదేండ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు.