సేంద్రియ విధానంలో పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. నందిగామ మండలంలోని కన్హాశాంతి వనంలో శనివారం సమున్నతి లైట్ హౌస్ ఎఫ్‌పీవోల కాన్క్లేవ్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అధిక శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. అందులో భాగంగానే రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, మద్దతు ధర వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రాజెక్టులు నిర్మించి, చెరువులను పునరుద్ధరించి సాగునీరు అందిస్తున్నారన్నారు.
నందిగామ, జూన్ 24 : కాలానికి అనుగుణంగా మారుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో శనివారం సమున్నతి లైట్ హౌస్ ఎఫ్‌పీవోల కాంన్క్లేవ్ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన ఎఫ్‌పీవోలతో కలిసి అత్యాధునిక వ్యవసాయం, మార్కెటింగ్ వంటి అనేక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశంలో వ్యవసాయం చేసేందుకు అనువైన భూములున్నాయని, దేశంలో వ్యవసాయ రంగంపైనే అధిక శాతం జనాభా ఆధారపడి జీవిస్తున్నారని.. దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించడం ద్వారా రైతులు, పేద ప్రజలు అభివృద్ధి చెందడంతో పాటు దేశం మరింత పురోగతి సాధిస్తుందన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, మద్దతు ధర కల్పించి పంటలు కొనుగోలు చేయడంతోపాటు అనేక కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. కాళేశ్వరం లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత, గొలుసుకట్టు చెరువులకు మరమ్మతులు చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. దేశంలో రైతులు అభివృద్ధి చెందాలంటే దేశానికి సమగ్రమైన వ్యవసాయ విధానం ఎంతో అవసరమన్నారు. రైతులను సేంద్రియ పంటల వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, సమున్నతి వంటి సంస్థలు సైతం తమ వంతు కృషి చేయాలని కోరారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేంద్రియ పంటల వైపు రైతులు అడుగులు వేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ట్రాన్స్ఫార్మింగ్ రూరల్ ఇండియా ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనీష్‌కుమార్, ఏపీఎమ్ఏఎస్ ఫౌండేషన్ సీఈవో సీఎస్ రెడ్డి, సమున్నతి డైరెక్టర్ ప్రవీశ్శర్మ, ఇండిపెండెంట్ డైరెక్టర్ వెంకటేశ్, సమున్నతి సంస్థ ప్రతినిధులున్నారు.