షాద్‌నగర్, జనవరి 01 : అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య అందించాలనే సంకల్పంతో షాద్‌నగర్ పట్టణంలో 100 పడకల ప్రభుత్వ దవాఖానను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ తెలిపారు. శనివారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో దవాఖాన నిర్మాణం, నిధుల వివరాలను వెల్లడించారు. షాద్‌నగర్ పట్టణంలో ప్రభత్వుం 100 పడకల దవాఖానను నిర్మించేందుకు రూ. 20.89 కోట్ల మంజూరు చేసిందన్నారు. పట్టణ శివారులోని లింగారెడ్డిగూడ సమీపంలోని అలిసాబ్‌గూడ వద్ద 5.26 ఎకరాల భూవిస్త్తీర్ణంలో దవాఖానను నిర్మించనున్నట్లు తెలిపారు. దవాఖాన నిర్మాణం, సివిల్ పనులకు రూ. 17 కోట్లు, యంత్ర పరికరాల కోసం రూ. కోటి 50 లక్షలు, వైద్య సిబ్బంది జీతభత్యాల కోసం రూ. 2 కోట్ల 7 లక్షలు, మందులకు రూ. 14 లక్షలు, సర్జికల్ అవసరాల కోసం రూ. 11 లక్షలు, ఇతర అవసరాల కోసం రూ.11 లక్షలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ కమ్యూనిటీ దవాఖాన స్థాయి పెంపు సామర్థ్యం కుదరకపోవడంతో భవిష్యత్‌ను, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 5 ఎకరాల స్థలంలో దవాఖానను నిర్మించబోతున్నామని తెలిపారు. ప్రస్తుత తరుణంలో ప్రజలు రోగాల భారిన పడి ఇబ్బందులు గురవుతున్న కారణంగా, కొవిడ్ సమయంలో దవాఖాన సామర్థ్యం సరిపోక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, వీటన్నిటిని దృష్ట్యా నూతన దవాఖాన నిర్మాణం జరగబోతుందని తెలిపారు.
అదే విధంగా డయాలసిస్ రోగుల కోసంం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటికి సంబంధించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో షాద్‌నగర్‌లో పెద్ద ఎత్తున వంద పడకల దవాఖానను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేశంపేట మండలంలో కూడ ప్రభుత్వ దవాఖాన స్థాయి అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు సర్వర్‌పాషా, అంతయ్య, శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, కృష్ణవేణి, కో ఆప్షన్ సభ్యుడు కిషోర్, నాయకులు జమృత్‌ఖాన్, నారాయణ, లక్ష్మణ్‌నాయక్, రవియాదవ్, శంకర్, రఘుమారెడ్డి పాల్గొన్నారు.